MD Siraj: బంగ్లాదేశ్ టాపార్డర్ ను కకావికలం చేసిన సిరాజ్

  • ఛట్టోగ్రామ్ లో భారత్, బంగ్లాదేశ్ తొలిటెస్టు
  • నేడు ఆటకు రెండో రోజు
  • తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 ఆలౌట్
  • మొదటి ఇన్నింగ్స్ షురూ చేసిన బంగ్లా
  • 56 పరుగులకే 4 వికెట్లు డౌన్
  • సిరాజ్ కు 3 వికెట్లు
Siraj scalps three quick wickets as Bangladesh in deep troubles

బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే స్పెల్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ కు పరీక్ష పెడుతున్నాడు. కొత్త బంతితో విజృంభిస్తున్న సిరాజ్ ను ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ఆపసోపాలు పడుతున్నారు. సిరాజ్ 9 ఓవర్లు విసిరి కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీయడం విశేషం. 

టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ను సిరాజ్ హడలెత్తించాడు. బంగ్లా ఓపెనర్లు నజ్ముల్ హుస్సేన్ శాంటో (0), జకీర్ హుస్సేన్ (20), కెప్టెన్ లిట్టన్ దాస్ (24) వికెట్లను పడగొట్టి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. మరో ఎండ్ లో ఉమేశ్ ఓ వికెట్ తీయడంతో ఆతిథ్య జట్టు 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ప్రస్తుతం బంగ్లా జట్టు 23 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ 15 పరుగులతోనూ, కెప్టెన్ షకీబల్ హసన్ 2 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు బంగ్లాదేశ్ ఇంకా 333 పరుగులు వెనుకబడి ఉంది.

More Telugu News