Supreme Court: అన్ని మతాల అమ్మాయిలకు ఒకే వివాహ వయస్సు వుండాలంటూ పిటిషన్... కేంద్రానికి సుప్రీం నోటీసులు

  • భారత్ లో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లు
  • ముస్లిం మతంలో అమ్మాయిల వివాహ వయసు 15 ఏళ్లు
  • పోక్సో చట్టానికి వ్యతిరేకం అంటున్న జాతీయ మహిళా కమిషన్
  • సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు 
Supreme Court issues notice to Center on same marital age for all girls of different faiths

భారతదేశంలో ఇతర మతాల అమ్మాయిలతో పోల్చితే ముస్లిం మతానికి చెందిన అమ్మాయిల వివాహ వయసు చాలా తక్కువ. ముస్లిం మతంలో అమ్మాయికి వివాహ వయసును 15 సంవత్సరాలుగా పేర్కొంటారు. భారత్ లో ప్రస్తుతం ఇతర మతాల అమ్మాయిల వివాహ వయసు 18 సంవత్సరాలుగా ఉంది. 

ఈ నేపథ్యంలో, ముస్లిం మతానికి చెందిన అమ్మాయిల వివాహ వయసును ఇతర మతాల అమ్మాయిల వివాహ వయసుతో సమానంగా చేయాలంటూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 

అమ్మాయి రజస్వల అయితే చాలు... పెళ్లి చేయడానికి ముస్లిం మతంలో అనుమతి ఇస్తున్నారని, ఇది పోక్సో చట్టానికి, భారతీయ శిక్షాస్మృతికి వ్యతిరేకమని మహిళా కమిషన్ పేర్కొంది. పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు అమ్మాయిలతో శృంగారం చట్ట విరుద్ధమని వివరించింది. అన్ని మతాలకు చెందిన అమ్మాయిల వివాహ వయసును 18 సంవత్సరాలుగా నిర్ణయించాలని సుప్రీం కోర్టును కోరింది. 

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రానికి స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News