Bandi Sanjay: గృహనిర్బంధంలో బండి సంజయ్.. కోర్టును ఆశ్రయించనున్న బీజేపీ

  • భైంసా నుంచి ప్రారంభం కావాల్సిన బండి సంజయ్ పాదయాత్ర
  • అనుమతిని నిరాకరించిన పోలీసులు
  • హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయనున్న బీజేపీ
Bandi sanjay in house arrest

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ఆయన ఐదో విడత పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆయన యాత్రకు, సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. యాత్ర కోసం నిన్న రాత్రి భైంసాకు వెళ్తున్న ఆయనను పోలీసులు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో అడ్డుకున్నారు. ఆయనను అక్కడి నుంచి కరీంనగర్ లోని ఇంటికి తరలించారు. ఇంటి నుంచి బయటకు రావద్దంటూ ఆయనను గృహనిర్బంధం చేశారు. 

ఈ నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేయనుంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు ఈ మధ్యాహ్నంకల్లా పాదయాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, పాదయాత్ర ప్రారంభం కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరుకావాల్సి ఉంది. అయితే, ప్రస్తుత అయోమయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాకపై సందిగ్ధత నెలకొంది. ఇంకోవైపు, పాదయాత్రకు అనుమతి నిరాకరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.

More Telugu News