D Rjaja: 2024లో బీజేపీ మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే దేశం సర్వనాశనం అవుతుంది: డి. రాజా

  • దేశ వ్యాప్తంగా బీజేపీపై వ్యతిరేకత నెలకొందన్న సీపీఐ నేత 
  • బీజేపీ నేతల్లో వణుకు మొదలైందన వెల్లడి
  • దేశాన్ని కాపాడాలంటే బీజేపీ, ఆరెస్సెస్ లను ఓడించాలని పిలుపు
Country will be destroyed if BJP come in to power in 2024 says D Raja

కేంద్రంలో బీజేపీ పాలనపై దేశ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా అన్నారు. బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందని చెప్పారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ప్రసంగాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. 

బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయని చెప్పారు. వీటితో పాటు నాగాలాండ్, త్రిపుర ఎన్నికల గురించి కూడా యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురు చూస్తోందని అన్నారు. 

మోదీ నియంతృత్వ పోకడలకు పోతూ, నిరంకుశ విధానాలను అమలు చేస్తున్నారని రాజా చెప్పారు. 2024 ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుందని అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థలను కాపాడుకోవాలంటే బీజేపీ, ఆరెస్సెస్ జోడీని ఓడించాలని చెప్పారు. దీని కోసం వామపక్షాలను, ప్రజాతంత్ర పార్టీలను, ప్రాంతీయ పార్టీల ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదే ధోరణితో తెలంగాణలో తాము ముందుకు సాగుతామని చెప్పారు. 

జీవనోపాధి సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాటాలను నిర్వహించాలని... తద్వారా కమ్యూనిస్టు పార్టీని శక్తివంతం చేయాలని పార్టీ శ్రేణులకు రాజా పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని మగ్దూం భవన్ లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News