Shahid Afridi: మహ్మద్ షమీ 'కర్మ' ట్వీట్ పై స్పందించిన అఫ్రిది

  • టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఓడిన భారత్
  • పాక్ నుంచి విమర్శలు.. ఫైనల్లో ఓడిన పాక్ జట్టు
  • సెటైర్ వేసిన టీమిండియా పేసర్ షమీ
Afridi reacts to Mohammad Shami Karma remarks

ఇటీవల టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియా ఓటమిపాలవగా, పాకిస్థాన్ వైపు నుంచి కొన్ని సెటైర్లు వినిపించాయి. ఇప్పుడదే పాకిస్థాన్ ఫైనల్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో, టీమిండియా పేసర్ మహ్మద్ షమీ... పాక్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ ట్వీట్ పై స్పందిస్తూ "సారీ బ్రదర్... దీన్నే కర్మ అంటారు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించాడు. 

అయితే షమీ ట్వీట్ పై పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది స్పందించాడు. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించాడు. "మనం క్రికెటర్లం... క్రీడా రాయబారుల్లాంటి వాళ్లం. మనం ఎప్పుడూ దేశాల (పాకిస్థాన్, భారత్) మధ్య నెలకొన్న సంక్షోభానికి చరమగీతం పాడడానికి ప్రయత్నించాలి. 

కానీ ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలను వ్యాపింపచేస్తాయి. అన్నీ తెలిసిన మనమే ఇలా చేస్తుంటే... అక్షరజ్ఞానం లేని మూర్ఖులు, సాధారణ మానవుల నుంచి ఇంకేం ఆశించగలం?

ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలి. క్రీడలే అందుకు మంచి మార్గం అని భావిస్తాను. మేం భారత్ తో ఆడాలని భావిస్తున్నాం... పాకిస్థాన్ లో భరత్ పర్యటించాలని కోరుకుంటున్నాం" అని అఫ్రిది పేర్కొన్నాడు.

More Telugu News