Nara Lokesh: పేద క్రీడాకారుల జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారు: నారా లోకేశ్

  • గ్రౌండ్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇస్తున్నారన్న లోకేశ్ 
  • పేద క్రీడాకారులు ఫీజుల చెల్లించలేక క్రీడలకు దూరమయ్యే అవకాశం ఉందని వ్యాఖ్య 
  • రాష్ట్రం క్రీడల్లో వెనుకబడే ప్రమాదం ఉందని విమర్శ 
Jagan govt playing games with poor sportsmen says Nara Lokesh

జగన్ రెడ్డి పాలనలో ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) క్రీడాకారుల పట్ల శాపంగా మారిందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. పేద క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న గ్రౌండ్స్ ను శాప్ ప్రైవేట్ వ్యక్తులను లీజుకు ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో శాప్ ఆధ్వర్యంలోని 52 బ్యాడ్మింటన్, 10 టెన్నిస్ కోర్టులు, 4 స్కేటింగ్ రింగులను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసి పేద క్రీడాకారులకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఈ ప్రక్రియ వల్ల క్రీడాకారులు ఫీజులు చెల్లించలేక క్రీడలకు దూరమయ్యే అవకాశం ఉందని... తద్వారా రాష్ట్రం క్రీడల్లో వెనుకబడే ప్రమాదం ఉందని అన్నారు. 

నేషనల్ గేమ్స్ లో పాల్గొన్న 300 మంది క్రీడాకారులకు చివరి నిమిషం వరకు ఎలాంటి సాయం అందించకుండా వేధించారని.. ఇప్పుడు ఏకంగా పేద క్రీడాకారుల జీవితాలతో గేమ్స్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. శాప్ లో అర్హత, క్రీడలకు సంబంధం లేని వారిని, వయస్సు మీరిన వారిని సలహాదారులుగా పెట్టుకుని అడ్డగోలుగా జీతాలు ఇచ్చి పోషించడానికి లేని అభ్యంతరాలు పేద క్రీడాకారుల విషయంలోనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.   

More Telugu News