Pollution: ఆసియాలోని కలుషిత నగరాల జాబితా.. టాప్ 8 నగరాలు మనదేశంలోనివే

  • అత్యధిక కాలుష్యం గురుగ్రామ్ లో..
  • ఢిల్లీ పరిస్థితి కొంత మెరుగుపడింది
  • ముజఫర్ నగర్ కూడా టాప్ లోనే..
  • గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న నగరాల జాబితాలో ఏపీలోని రాజమహేంద్రవరం
Among 10 most polluted cities in Asia 8 are from India

గాలి కాలుష్యం విషయంలో భారత దేశ నగరాల్లో పరిస్థితులు ఏమంత మెరుగ్గాలేవని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక తేల్చి చెప్పింది. ఆసియాలోని అత్యంత కలుషిత నగరాలు ఎక్కువగా భారత్ లోనే ఉన్నాయని వెల్లడించింది. గాలి నాణ్యత విషయంలో ఏయే నగరాలు మెరుగ్గా ఉన్నాయి, ఏయే నగరాలు అధ్వాన్నంగా ఉన్నాయని పరిశీలించి ఓ నివేదికను విడుదల చేసింది. ఆసియాలోని కలుషిత నగరాల జాబితాలో టాప్ టెన్ లో ఎనిమిది భారతీయ నగరాలే.. అందులో గురుగ్రామ్ టాప్ లో ఉంది. ఆదివారం ఉదయం గురుగ్రామ్ లో గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 679 పాయింట్లుగా ఉంది. రేవారి దగ్గర్లోని ధారుహెర నగరంలోనూ కాలుష్యం ఎక్కువే. ఇక్కడ ఏక్యూఐ 543 పాయింట్లుగా నమోదైంది. 

బీహార్ లోని ముజఫర్ నగర్ లో ఏక్యూఐ 316 పాయింట్లు, లక్నో దగ్గర్లోని తాల్కోర్ ఏక్యూఐ 298 పాయింట్లు, డీఆర్ సీసీ ఆనంద్ పూర్ (బెగుసరాయ్) లో 269 పాయింట్లు, భోపాల్ ఛౌరాహా(దేవాస్) లో 266 పాయింట్లు, ఖడక్ పాడ(కళ్యాణ్)లో 256 పాయింట్లు, దర్శన్ నగర్(చప్రా)లో 239 పాయింట్లుగా ఏక్యూఐ నమోదైందని వెల్లడించింది. చైనాలోని క్సియోషియాంగ్ సిటీతో పాటు మంగోలియాలోని ఉలాన్ బాటా నగరం కూడా టాప్ టెన్ లో ఉంది. మరోవైపు, ఆసియాలో గాలినాణ్యత మెరుగ్గా ఉన్న నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం చోటు దక్కించుకుంది. ఆసియాలోని టాప్ టెన్ నగరాల్లో భారత్ నుంచి టాప్ టెన్ లో నిలిచిన ఒకే ఒక నగరం రాజమహేంద్రవరం.

More Telugu News