Kerala: కేరళ ప్రభుత్వం.. గవర్నర్‌కు మధ్య వివాదం: రాజీనామా చేయాలంటూ 9 మంది వీసీలకు కేరళ గవర్నర్ ఆదేశం

  • యూనివర్సిటీలకు వీసీల నియామకంలో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం
  • నేటి ఉదయం 11.30 కల్లా రాజీనామా పత్రాలు తనకు చేరాలని గవర్నర్ ఆదేశం
  • ప్రభుత్వంతో కొనసాగుతున్న వివాదం
Kerala Governor demands resignation of nine Vice Chancellors

యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్ల నియామకం విషయంలో కేరళ ప్రభుత్వంతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో గవర్నర్ మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని 9 విశ్వవిద్యాలయాల వీసీలు తక్షణం రాజీనామా చేయాలని ఆదేశించారు. అంతేకాదు, నేటి (సోమవారం) ఉదయం 11.30 గంటలకల్లా  రాజీనామాలు తనకు అందాలని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. కేరళలోని ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలాజికల్ యూనివర్సిటీ వీసీ నియామకం యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆ నియామకాన్ని రద్దు చేసింది. 

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల వీసీలు రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు కేరళ రాజ్‌భవన్ నిన్న ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ 9 యూనివర్సిటీల్లో ఏపీజే అబ్దుల్ కలాం టెక్నలాజికల్ యూనివర్సిటీ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం, లాటరీని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తోందంటూ ప్రభుత్వంపై ఇటీవల గవర్నర్ మండిపడ్డారు. ఇది వింటుంటే తనకు సిగ్గుగా ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఉన్న వైరాన్ని ప్రస్ఫుటం చేశాయి. డ్రగ్స్‌కు పంజాబ్ అడ్డా అని, త్వరలోనే కేరళ దానిని దాటేస్తుందని గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది.

More Telugu News