Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు

  • మూడు పెళ్లిళ్లపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆదేశం
  • స్టెఫ్నీ అంటూ మహిళలను అవమానించారని నిరసన
  • మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
Ap womens commission issues notice to pawan kalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ శనివారం నోటీసులు జారీచేసింది. మూడు పెళ్లిళ్లకు సంబంధించి ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు. 

వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు. భార్యకు విడాకులతో పాటు భరణం ఇచ్చి ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చనడం తనను బాధించిందని పద్మ చెప్పారు. భరణం ఇచ్చి భార్యను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఎలా? అని ప్రశ్నించారు. స్టెఫ్నీ అంటూ మహిళలను సంబోధించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తన పెళ్లిళ్ల విషయంలో పదేపదే విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై పవన్ విరుచుకుపడ్డారు. తాను విడాకులు ఇచ్చి, భరణం ఇచ్చాకే మరో పెళ్లి చేసుకున్నానని పవన్ వివరించారు. చేతనైతే మీరు కూడా భరణమిచ్చి మరో పెళ్లి చేసుకోండని చెప్పారు. ఒక్క పెళ్లి చేసుకుని ముప్పై మంది స్టెఫ్నీలతో తిరుగుతారని వైసీపీ నేతలపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఏపీ మహిళా కమిషన్ పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది.

More Telugu News