Golden canary: చెత్తలో దొరికిన వజ్రం.. ఈ ‘గోల్డెన్​ కనరీ’ రూ.123 కోట్లు పలుకుతుందట

  • ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పసుపు వజ్రంగా గుర్తింపు
  • ప్రస్తుతం దుబాయ్ లోని సోత్ బీ వేలం శాలలో ప్రదర్శన..
  • డిసెంబర్ ఏడో తేదీన న్యూయార్క్ లో వేలం వేయనున్న సోత్ బీ సంస్థ
golden canary diamond to be auction this december

అదో వజ్రాల మైనింగ్ కంపెనీ.. వజ్రాల కోసం మట్టిని తవ్వుతోంది.. ఆ మట్టిని గాలించి, ప్రతి రాయిని పరిశీలించి.. ఏదైనా దొరికితే తీసుకుంటోంది. తర్వాత ఆ మట్టిని, రాళ్లను తీసుకెళ్లి దూరంగా పారబోస్తోంది. ఓ ఇంటి వెనుక పెరట్లో కాస్త గుంతలా ఉండటంతో మట్టికావాలని దాని యజమాని అడిగాడు. దీనితో మట్టి తరలించే కాంట్రాక్టర్.. వజ్రాల గనిలో తవ్వి, పరిశీలించిన మట్టి, రాళ్ల కుప్పను తీసుకువచ్చి ఆ ఇంటి వెనుక పెరట్లో పారబోశాడు. తర్వాత ఆ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారికి.. ఆ మట్టి, రాళ్ల కుప్పలో మెరుస్తున్న ఓ రాయి దొరికింది. అదే ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన, పెద్ద పసుపు రంగు వజ్రం ‘గోల్డెన్ కనరీ’కి ముడి రూపం. త్వరలోనే ఈ వజ్రాన్ని వేలం వేయనున్నారు.

కాంగోలోని గనిలో దొరికి..
1980లో కాంగో దేశంలోని ఎంఐబీఏ అనే వజ్రాల మైనింగ్ సంస్థ తవ్విన గనికి సంబంధించిన మట్టిలో ఈ గోల్డెన్ కనరీ వజ్రం దొరికింది. ఆ చిన్నారి ఈ రాయిని తీసుకెళ్లి ఇంటి యజమానికి ఇచ్చింది. అది వజ్రమని గుర్తించిన ఆయన.. స్థానిక వజ్రాల వ్యాపారికి అమ్మి డబ్బులు తీసుకున్నాడు. ఆ సమయంలో దాని బరువు ఏకంగా 890 క్యారెట్లు కావడం గమనార్హం. అంటే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద వజ్రం అన్నమాట.

సానబెడుతుంటే చిన్నగా అయిపోయి..
ఆ వజ్రం చేతులు మారుతూ, సానపెట్టే క్రమంలో ముక్కలు అవుతూ వచ్చింది. వాటిలో ప్రస్తుతమున్న పెద్ద ముక్కను ‘గోల్డెన్ కనరీ’ వజ్రంగా పిలుస్తున్నారు. దీని బరువు 303.1 క్యారెట్లు. ప్రస్తుతం దీనిని దుబాయ్‌ లోని సోత్‌ బీ వేలం శాలలో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఏడాది డిసెంబర్‌ ఏడో తేదీన న్యూయార్క్‌ లోని సోత్ బీ వేలం శాలలో ఈ వజ్రాన్ని వేలం వేయనున్నారు. దీనికి కనీసం  రూ.123 కోట్లకుపైగా ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News