Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక లాంఛనమేనంటున్న కాంగ్రెస్ వర్గాలు

  • ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు 
  • 96 శాతం పోలింగ్ నమోదు
  • సోనియా సహా అందరి మద్దతు ఖర్గేకే 
Mallikarjun Kharge to be Congress Next President

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో 96 శాతం పోలింగ్ జరిగింది. 9,900 మంది పీసీసీ ప్రతినిధుల్లో 9,500 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. చిన్న రాష్ట్రాల్లోనూ వందశాతం ఓటింగ్ జరిగినట్టు ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో 87 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్ సహా సీనియర్ నేతలు ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాబట్టి ఖర్గే ఎన్నిక లాంఛనమేనని చెబుతున్నారు. కాగా, అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా గాంధీ కుటుంబం అభిప్రాయాలను కూడా వినాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి పి.చిదరంబరం అన్నారు. గాంధీయేతర నేత పగ్గాలు స్వీకరించినప్పటికీ ఫస్ట్ ఫ్యామిలీ గొంతు మూగబోయినట్టు కాదని స్పష్టం చేశారు. సోనియా ఎప్పటికీ తమకు నాయకురాలేనని, ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పేర్కొన్నారు.

More Telugu News