Ukraine: ఉక్రెయిన్ కు పెను సవాల్.. విరుచుకుపడుతున్న ఇరాన్ డ్రోన్లు

  • ఇరాన్ మేడ్ షాహెద్-136 డ్రోన్లను ప్రయోగిస్తున్న రష్యా
  • ఈ డ్రోన్లను రష్యాకు తాము సరఫరా చేయలేదన్న ఇరాన్
  • కీవ్ కు సమీప ప్రాంతాల్లో డ్రోన్లతో దాడి
Russia attack in Ukraine with Iranian drones

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. తొలిసారి ఇరాన్ తయారీ డ్రోన్లు ఉక్రెయిన్ లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు 45 మైళ్ల దూరంలోని బిలా ట్సెర్క్వా నగరంలో ఈ డ్రోన్లతో దాడి జరిగింది. డజన్ల కొద్దీ ఇరానియన్ డ్రోన్లతో రష్యా ఈ దాడులకు పాల్పడింది. పలు విడతలుగా నిన్న ఈ దాడులు జరిగాయి. ఈ దాడులపై ఉక్రెయిన్ స్పందించింది. గత మూడు వారాలుగా ఇరానియన్ మేడ్ షాహెద్-136 డ్రోన్లతో రష్యా దాడులకు పాల్పడుతోందని తెలిపింది. కీవ్ కు సమీపంలో ఉన్న ప్రాంతాలపై నిన్న దాడులు చేసిందని వెల్లడించింది. 

మరోవైపు దీనిపై ఇరాన్ స్పందిస్తూ... తాము రష్యాకు డ్రోన్లను సరఫరా చేయలేదని తెలిపింది. మరోవైపు ఇరాన్ డ్రోన్లను ఉపయోగించారనే వార్తలపై రష్యా మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఇంకోవైపు ఈ డ్రోన్ దాడులపై 80 ఏళ్ల ఒలోదిమిర్ అనే వృద్ధుడు స్పందిస్తూ... తీవ్ర భయాన్ని వ్యక్తం చేశారు. కర్ణకఠోరంగా ఉన్న భారీ శబ్దాలు వచ్చాయని ఆయన తెలిపారు. తొలుత తాను పేలుడు శబ్దాన్ని విన్నానని... ఆ తర్వాత పేలుడును కళ్లారా చూశానని చెప్పారు. 

దక్షిణ ఉక్రెయిన్ లో ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి రష్యా ఈ డ్రోన్ దాడులు చేసిందని ఉక్రేనియన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి తెలిపారు. ఆరు డ్రోన్లను మార్గమధ్యంలోనే కూల్చేశామని చెప్పారు. ఈ డ్రోన్లు తమ అన్ని డిఫెన్స్ ఫోర్సెస్ కు పెను సవాలని... వీటిని ఎదుర్కోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని అన్నారు.

More Telugu News