KTR: సమ్మె చేసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను మెచ్చుకున్న కేటీఆర్

  • బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన కేటీఆర్
  • విద్యార్థులతో కలిసి భోజనం.. అనంతరం ప్రసంగం
  • తాను కూడా హాస్టళ్లలో చదివానని వెల్లడి
  • హాస్టళ్లలో ఇబ్బందులు తెలుసని వివరణ
KTR appreciates Basara IIIT students who has participated in strike

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, అనంతరం సభలో పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను కూడా హాస్టళ్లలో చదివిన వాడినే అని, హాస్టళ్లలో ఉండే సాధకబాధకాలు తనకు తెలుసని అన్నారు. 

సమ్మె సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనుసరించిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. రాజకీయాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా, తమ సమస్యలపై తామే పోరాడిన విద్యార్థులను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. 

పనిలేని ప్రతిపక్ష నాయకులను పిలవకుండా, స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ గా ఏర్పడి మీ సమస్యలపై మీరే పోరాడడం బాగుందని అన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి కూడా తనకు బాగా నచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. 

మహాత్మాగాంధీ తరహాలో శాంతియుతంగా, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా బయట కూర్చుని నిరసన తెలియజేయడం చాలా మందికి నచ్చిందని, అందులో తాను కూడా ఒకడ్నని తెలిపారు. తాను ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఈ మాట చెబుతున్నానని అన్నారు. తమ సమస్యలను నివేదించేందుకు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికే సమ్మె చేస్తున్నామని స్పష్టంగా చెబుతూ, ఎంతో పద్ధతిగా ఉద్యమాన్ని నడిపిన విద్యార్థులందిరనీ అభినందిస్తున్నాను అని తెలిపారు. 

మనది ప్రజాస్వామిక దేశం అని, ఏదైనా సమస్య పరిష్కారం కానప్పుడు నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదంతా ఓ కుటుంబ వ్యవహారం వంటిదేనని వివరించారు. 

"ఈ విద్యాసంస్థ మీది... ఇక్కడ మెరిట్ ఉన్నవాళ్లకే స్థానం. అయితే ఆశించినస్థాయిలో మౌలికవసతులు లేకపోవడంపై కొందరు విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ఇక్కడి పరిస్థితులు చూసి ఎన్ఐటీ, ఐఐటీకి వెళదామా అని ఆలోచిస్తున్నారని, వారు నాతో చెప్పారు. విద్యార్థులు ఇక్కడే ఉండాలంటే ఎన్ఐటీ, ఐఐటీలకు దీటుగా ఈ విద్యాసంస్థను తీర్చిదిద్దాలని వారు కోరారు. అందుకే వెంకటరమణ వంటి మంచి అధికారిని వీసీగా తెచ్చాం. వారు ఈ వ్యవస్థను అర్థం చేసుకుని సమస్యలను ప్రక్షాళన చేసేంత వరకు కొంతం సమయం పడుతుంది" అని కేటీఆర్ వివరించారు.

More Telugu News