Students: ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు ఊరటనిచ్చేలా జాతీయ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం

  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • భారత్ కు తిరిగొచ్చేసిన వైద్య విద్యార్థులు
  • ఇతర కాలేజీల్లో చేరేందుకు ఎన్ఎంసీ అనుమతి
  • బదిలీకి ఉక్రెయిన్ అంగీకారం
NMC allows Ukraine returned medical students to continue study in other colleges

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం భారత విద్యార్థులకు ఇబ్బందికరంగా మారడం తెలిసిందే. ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులు రష్యా దాడుల నేపథ్యంలో, అర్థాంతరంగా స్వదేశానికి తిరిగొచ్చారు. ఇప్పటికీ ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా, విద్యాసంస్థల మూసివేత అమల్లో ఉంది. దాంతో, వైద్య విద్య మధ్యలోనే ఆగిపోవడంతో భారత విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

ఈ నేపథ్యంలో, వైద్య విద్యార్థులకు ఊరట కలిగించేలా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉక్రెయిన్ వర్సిటీల్లో చదివిన వైద్య విద్యార్థులు ఇకపై భారత్ లోని మెడికల్ కాలేజీల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మెడికల్ కాలేజీల్లోనూ చేరేందుకు అనుమతించింది. 

గతంలో విదేశీ వర్సిటీల్లో చదివే భారత విద్యార్థులు కోర్సు మధ్యలో కాలేజీ మారడం వీలయ్యేది కాదు. కోర్సు యావత్తు ఒకే కాలేజీలో చదవాల్సి వచ్చేది. ట్రైనింగ్, ఇంటర్న్ షిప్, అదే విదేశీ వర్సిటీలో పూర్తిచేయాల్సి వచ్చేది. 

అయితే, వందల సంఖ్యలో వైద్య విద్యార్థుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఎన్ఎంసీ కాలేజీ బదిలీ వెసులుబాటు కల్పించింది. అటు, ఉక్రెయిన్ కూడా భారత విద్యార్థుల ట్రాన్సఫర్ కు సమ్మతించినట్టు తెలుస్తోంది. ఈ బదిలీ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మెడికల్ కాలేజీల్లో చదివినప్పటికీ సర్టిఫికెట్ మాత్రం ఉక్రెయిన్ లోని మాతృ కళాశాల పేరిటే మంజూరు చేస్తారని ఎన్ఎంసీ తాజా ప్రకటనలో వెల్లడించింది.

More Telugu News