Serial Killers: దేశంలో సీరియల్ కిల్లర్లకు అడ్డా ఆ రాష్ట్రం!

  • మధ్యప్రదేశ్ లో వరుస హత్యల బీభత్సం
  • ఇటీవల ఐదు రోజుల వ్యవధిలో 4 హత్యలు
  • పోలీసుల అదుపులో 19 ఏళ్ల శివప్రసాద్ ధుర్వే
  • సెక్యూరిటీ గార్డులనే లక్ష్యంగా చేసుకున్న ధుర్వే
  • గతంలోనూ సీరియల్ కిల్లర్ల ఉన్మాదం
Madhya Pradesh witnessed serial killers in the past also

కొన్నిరోజుల కిందట మధ్యప్రదేశ్ లో శివప్రసాద్ ధుర్వే అనే టీనేజి కుర్రాడు ఐదు రోజుల వ్యవధిలో 4 హత్యలు చేసి సంచలనం సృష్టించడం తెలిసిందే. కేజీఎఫ్ చిత్రంలోని హీరోలా పేరు తెచ్చుకునేందుకు ఆ కుర్రాడు హత్యల బాట పట్టాడు. సీరియల్ కిల్లర్ అవతారమెత్తి, నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులను లక్ష్యంగా చేసుకుని దారుణంగా దాడిచేసి హతమార్చాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మధ్యప్రదేశ్ లో గతంలోనూ సీరియల్ కిల్లర్లు భయానక వాతావరణం సృష్టించిన ఘటనలు ఉన్నాయి. ఆదేశ్ ఖమ్రా, సర్మాన్ శివ్ హరే, ఉదయన్ దాస్ అనే వ్యక్తులు నరరూప రాక్షసుల్లా మారి వరుస హత్యలతో బీభత్సం సృష్టించారు. వీరిలో ఆదేశ్ ఖమ్రా 34 హత్యలతో ప్రజలను వణికించగా, సర్మాన్ శివ్ హరే 22 హత్యలు చేసి తన రక్తదాహాన్ని చాటుకున్నాడు. 

ఆదేశ్ ఖమ్రా వృత్తిరీత్యా ఓ టైలర్. పగలంతా ఓ సాధారణ దర్జీ మాదిరే బట్టలు కుట్టే ఖమ్రా... రాత్రయితే మృత్యువుకు ప్రతిరూపంగా మారిపోయేవాడు. కేవలం ట్రక్కు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని అంతమొందించేవాడు. తన హత్యలకు బలమైన కారణం ఉందని ఖమ్రా చెప్పేవాడు. 

ట్రక్కు డ్రైవర్లు విధి నిర్వహణలో భాగంగా ఇంటికి దూరంగా ఉంటారని, కుటుంబానికి దూరంగా ఉంటూ వారు అనుభవించే బాధ నుంచి వారికి తాను విముక్తి కలిగించేవాడ్నని ఖమ్రా తన హత్యలను సమర్థించుకున్నాడు. 2018లో అతడిని మహిళా ఎస్పీ బిట్టూ శర్మ అరెస్ట్ చేశారు. ఆమె ఎంతో ధైర్యంగా ఓ అటవీప్రాంతంలో ఖమ్రాను పట్టుకున్నారు. 

ఇక, సర్మాన్ శివ్ హరే విషయానికొస్తే.... 4 ఏళ్ల వ్యవధిలో 22 మందిని పొట్టనబెట్టుకున్నాడు. 2011లో అతడిని అరెస్ట్ చేశారు. అతడికి అపారమైన డబ్బు సంపాదించాలని, రాజకీయ నాయకుడు అవ్వాలన్న పెద్ద కోరికలు ఉండేవి. అతడి ఒకే ఒక్క బలహీనత మూఢనమ్మకాలు. ఓసారి హత్య చేసేందుకు వెళుతుండగా పిల్లి అడ్డం వచ్చిందని, తన ప్లాన్ మార్చేసుకున్నాడు. 

ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసిన సర్మాన్ శివ్ హరే... తన తొలి పిస్టల్ బాగా పనిచేస్తుందో, లేదో తెలుసుకునేందుకు ఓ మహిళను కాల్చి చంపాడు. ఆమెలో ఊపిరి ఆగిపోయేదాకా దగ్గర నుంచి చూసి, ఆపై తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. 

ఉదయన్ దాస్ అనే వ్యక్తి కూడా మధ్యప్రదేశ్ లో ఉన్మాదిగా గుర్తింపు పొందాడు. 2010లో తల్లిదండ్రులను గార్డెన్ లో పూడ్చివేసిన ఉదయన్ దాస్... 2016లో గాళ్ ఫ్రెండ్ ను చంపేసి బెడ్రూంలోనే ఆమెకు సమాధి కట్టాడు. దాస్ ను పోలీసులు 2020లో అరెస్ట్ చేశారు.

More Telugu News