Contable: పాపం... డీసీపీ అని తెలియక రూ.500 లంచం అడిగిన కానిస్టేబుల్!

  • రాజస్థాన్ లోని జైపూర్ లో ఘటన
  • నాకాబందీ నిర్వహించిన డీసీపీ
  • తిరిగొస్తుండగా డీసీపీ వాహనాన్ని ఆపిన కానిస్టేబుల్
  • సీట్ బెల్ట్ లేదంటూ చలాన్ రాసేందుకు ప్రయత్నం
  • రూ.500 ఇస్తే చలాన్ రాయనని ఆఫర్
Constable asks bribe from DCP in Jaipur

ట్రాఫిక్ పోలీసుల్లో కొందరు లంచావతారాలు ఉండడం తెలిసిందే. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన రాజేంద్రప్రసాద్ అనే కానిస్టేబుల్ కూడా ఈ కోవకే చెందుతాడు. అయితే, అతడు సాక్షాత్తు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)నే లంచం అడిగి సస్పెండ్ అయ్యాడు. ఆ డీసీపీ సాధారణ దుస్తుల్లో ఉండడంతో కానిస్టేబుల్ గుర్తించలేకపోయాడు. 

జైపూర్ నార్త్ విభాగంలో పరీష్ దేశ్ ముఖ్ డీసీపీగా వ్యవహరిస్తున్నారు. బుధవారం రాత్రి నగరంలో నాకాబందీ నిర్వహించి తిరిగొస్తున్నారు. ఆయన వాహనంపై పోలీసు గుర్తులు కూడా లేవు. ఆయనతో పాటు ఉన్న గన్ మన్, డ్రైవర్ కూడా సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. డీసీపీ పరీష్ దేశ్ ముఖ్ ప్రయాణిస్తున్న వాహనం ట్రాన్స్ పోర్ట్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోటరీ సర్కిల్ వద్దకు వచ్చింది. 

అక్కడ కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ డీసీపీ వాహనాన్ని ఆపేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటూ చలాన్ రాసేందుకు సిద్ధమయ్యాడు. రూ.500 లంచం ఇస్తే చలాన్ రాయనని చెప్పాడు. ఈ విషయాన్ని డీసీపీ వెంటనే తన పై అధికారులకు నివేదించారు. డీసీపీ ఇచ్చిన సమాచారం ఆధారంగా కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ ను అధికారులు వెంటనే సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో పోలీసుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ అని పోలీసు అధికారులు తెలిపారు. ఇందులో కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ అడ్డంగా దొరికిపోయాడని వెల్లడించారు.

More Telugu News