Pregnant woman: నిండు గర్భిణిని తోపుడు బండిపై ఆస్పత్రికి.. డాక్టర్లు, నర్సులు ఎవరూ లేరు!.. వీడియో ఇదిగో

  • ప్రభుత్వ అంబులెన్సుకు ఫోన్ చేస్తే లాభం లేకపోవడంతో తోపుడు బండిపై తరలించిన భర్త
  • ఇంతా చేసి ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు ఎవరూ లేని తీరు
  • మధ్యప్రదేశ్ లోని రానే గ్రామంలో ఘటన.. వైరల్ గా మారిన వీడియో
Man takes pregnant wife to hospital on push cart

ఆమె నిండు గర్భిణి.. పురుటి నొప్పులు మొదలయ్యాయి. దాంతో వెంటనే ఆమె భర్త ప్రభుత్వ అంబులెన్సు 108కు ఫోన్ చేశాడు. కానీ ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేదని.. కనీసం రెండు గంటల సమయం పడుతుందని సమాధానం వచ్చింది. ఇటు చూస్తే ఆమెకు నొప్పులు పెరిగిపోయి.. తీవ్రంగా అవస్థ పడుతోంది. చేసేదేమీ లేక.. దగ్గరిలో ఉన్న ఓ తోపుడు బండి తీసుకొచ్చాడు. దానిపై భార్యను పడుకోబెట్టి తోసుకుంటూ.. రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆస్పత్రికి ఎలాగోలా చేరుకున్నా.. అక్కడ వైద్యులు, నర్సులు లేకపోవడంతో హతాశుడయ్యాడు. మధ్యప్రదేశ్ లోని దమో జిల్లా రానే గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది.

వీడియో వైరల్ కావడంతో..
గర్భిణిని తోపుడు బండిపై తీసుకెళ్లిన ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. ప్రభుత్వ అంబులెన్సు కోసం ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని.. ఎలాగోలా ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రభుత్వ ఆస్పత్రిలో తగిన వైద్యం అందలేదని గర్భిణి భర్త అహిర్వాల్ వాపోయాడు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు రావడంతో వెంటనే ఆ గర్భిణిని ప్రభుత్వ అంబులెన్సులో దమో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు మెడికల్ ఆఫీసర్ ఆర్ పీ కోరి వెల్లడించారు. 

More Telugu News