delhi: దేశంలో మహిళలకు రక్షణలేని నగరం ఏదంటే..!

  • గతేడాది ఢిల్లీలో రోజుకు సగటున ఇద్దరు మైనర్లపై అత్యాచార కేసులు వచ్చాయని ఎన్సీఆర్బీ రిపోర్టులో వెల్లడి
  • ఢిల్లీలో 2021లో 13,892 మహిళలపై నేరాల కేసుల నమోదు
  • మహిళలకు రక్షణలేని నగరాల్లో అగ్రస్థానంలో ఢిల్లీ.. తర్వాతి స్థానాల్లో ముంబై, బెంగళూరు
Delhi is Most Unsafe For Women india as per ncrb report

దేశంలో మహిళలకు రక్షణ లేని నగరంగా రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. దేశ రాజధానిలో గత ఏడాది ప్రతిరోజూ ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురయ్యారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక తెలిపింది. ఢిల్లీలో మహిళలపై నేరాలు కూడా పెరుగుతున్నాయని చెప్పింది. 2021లో ఢిల్లీలో 13,892 మహిళలపై నేరాల కేసులు నమోదయ్యాయని 2020తో పోలిస్తే 40 శాతం కంటే ఎక్కువ పెరిగిందని ఎన్సీఆర్బీ వెల్లడించింది. 2020లో నేరాల సంఖ్య 9,782గా ఉందని తన డాటాలో తెలిపింది. 

 ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం 19 మెట్రోపాలిటన్ నగరాల్లో మహిళలపై జరిగిన నేరాలలో ఒక్క ఢిల్లీలోనే 32.20 శాతం ఉన్నాయి. ఢిల్లీ తర్వాత 5,543 కేసులతో ఆర్థిక రాజధాని ముంబై రెండో స్థానంలో ఉండగా.. మూడో ప్లేస్ లో ఉన్న బెంగళూరులో 3,127 కేసులు నమోదయ్యాయి. 19 మెట్రో నగరాల్లో జరిగిన మొత్తం నేరాల్లో  వరుసగా 12.76 శాతం, 7.2 శాతం కేసులు ముంబై, బెంగళూరులోనే నమోదయ్యాయి.  

2021లో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కిడ్నాప్ (3948), భర్తల క్రూరత్వం (4674), బాలికలపై అత్యాచారాలు (833) వంటి విభాగాల్లో మహిళలపై నేరాల కేసులు అత్యధికంగా దేశ రాజధానిలోనే ఉన్నాయి. గతేడాది సగటున ఢిల్లీలో ప్రతిరోజూ ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. 2021లో దేశ రాజధానిలో మహిళలపై నేరాలకు సంబంధించి 13,982 కేసులు నమోదు కాగా.. దేశంలోని 19 మెట్రోపాలిటన్ నగరాల్లో  ఇలాంటి కేసులు మొత్తం 43,414  వచ్చాయని ఎన్సీఆర్బీ పేర్కొంది. 

రాజధానిలో 2021లో 136 వరకట్న మరణాల కేసులు నమోదయ్యాయి. 19 మెట్రోపాలిటన్ నగరాల్లో జరిగిన ఇలాంటి మరణాలలో ఇది 36.26 శాతం. నగరంలో మహిళల అపహరణ, కిడ్నాప్ కేసులు 3,948 వెలుగు చూశాయి. అదే సమయంలో మిగతా మెట్రోపాలిటన్ నగరాల్లో మొత్తం 8,664 కేసులు వచ్చాయి.

ఢిల్లీలో గతేడాది మహిళలపై 2,022 దాడులు జరిగినట్టు గుర్తించారు. 2021లో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (బాలికల బాధితులు మాత్రమే) కింద 1,357 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ తెలిపింది. ఆ సంస్థ లెక్కల ప్రకారం గతేడాది అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కంటే అత్యధికంగా ఢిల్లీలో 833 బాలికలపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి.

More Telugu News