OTT platforms: మరో ఏడాదిలో మల్టీ ప్లెక్స్ లను వెనక్కి నెట్టేయనున్న ఓటీటీ పరిశ్రమ

  • 2023 నాటికి రూ.11,944 కోట్లకు విస్తరణ
  • వినోద పరిశ్రమలో 7-9 శాతం వాటా
  • ప్రస్తుతం 45 కోట్ల చందాదారులు
  • భవిష్యత్తులో విద్య, హెల్త్ విభాగాల్లోకీ విస్తరణ
  • ఎస్ బీఐ రీసెర్చ్ రిపోర్ట్
OTT platforms may upend multiplexes run soon set to be a Rs 12000cr industry by 2023

ఓటీటీ పరిశ్రమ.. ఇంతై, ఇంతింతై, వటుడింతై అన్నట్టుగా విస్తరించుకుంటూ పోతోంది. కరోనా మహమ్మారి రావడం ఓటీటీ పరిశ్రమకు టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వరుసగా కొన్ని నెలల పాటు థియేటర్లు మూసివేయాల్సి వచ్చింది. వినోదానికి అలవాటు పడిన వారు చూస్తూ ఊరుకోలేరు కదా. ఓటీటీలను ఆశ్రయించారు. కోరుకున్న సినిమాను చూసే వెసులుబాటు వారికి బాగా నచ్చింది.

అంతేకాదు, కరోనా వల్ల థియేటర్లు లేకపోవడంతో, సినీ నిర్మాతలు ధైర్యం చేసి తమ సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడం మొదలు పెట్టారు. దీంతో కొత్త సినిమాలను తమ మొబైల్ ఫోన్లో ఉన్న చోట నుంచే ప్రేక్షకులు వీక్షించగలిగారు. బ్లాక్ బస్టర్ సినిమాలు సైతం మూడు నెలల్లో ఓటీటీల్లోకి వస్తుండడంతో ఇంక థియేటర్లకు ఎందుకు వెళ్లడం? అన్నది ఎక్కువ మంది ప్రేక్షకుల మనసుల్లో పడిపోయింది. అందుకే ఇప్పుడు థియేటర్ల వ్యాపారం పడిపోతే, ఓటీటీ వ్యాపారం జోరుగా సాగుతోంది.

మల్టీ ప్లెక్స్ లను మించి ఓటీటీ పరిశ్రమ 2023 నాటికి అవతరిస్తుందని ఎస్ బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. రూ.11,944 కోట్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. 2018 నాటికి ఓటీటీ పరిశ్రమ వ్యాపారం విలువ రూ.2,590 కోట్లుగానే ఉంది. అక్కడి నుంచి ఎన్ని రెట్లు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. 2000వ దశకంలో వీసీఆర్/వీసీపీ/వీసీడీలను మల్టీ ప్లెక్స్ పరిశ్రమ దెబ్బకొట్టినట్టే.. ఇప్పుడు ఓటీటీ పరిశ్రమ మల్టీప్లెక్స్ లను దెబ్బతీయనుందని ఎస్ బీఐ రీసెర్చ్ భావిస్తోంది.

మన దేశంలో సుమారు 40 ఓటీటీలు వివిధ భాషాల్లో వినోదాన్ని అందిస్తున్నాయి. దేశ వినోద పరిశ్రమలో ఇప్పటికే ఓటీటీలు 7-9 శాతం వాటాకు చేరుకున్నాయని ఎస్ బీఐ రీసెర్చ్ తెలిపింది. నేడు దేశంలో 45 కోట్ల ఓటీటీ చందాదారులు ఉన్నారని, 2023 చివరికి 50 కోట్లకు పెరుగుతారని అంచనా వేసింది. అధిక స్పీడ్ తో కూడిన మొబైల్ ఇంటర్నెట్ ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు 14 కోట్లు, అమెజాన్ ప్రైమ్ కు 6 కోట్లు, నెట్ ఫ్లిక్స్ కు 4 కోట్లు, జీ5కు 3.7 కోట్లు, సోనీలివ్ కు 2.5 కోట్ల చొప్పున కస్టమర్లు ఉన్నారు. రానున్న రోజుల్లో  ఈ ఓటీటీలు విద్య, ఆరోగ్యం, ఫిట్ నెస్ విభాగాల్లోకీ విస్తరిస్తాయని ఎస్ బీఐ రీసెర్చ్ తెలిపింది.

More Telugu News