Andhra Pradesh: వర్షాకాలంలో వేసవి ఉక్కపోత.. ఒంగోలులో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

  • బలహీనపడిన నైరుతి రుతుపవనాలు
  • ముఖం చాటేసిన వరుణుడు
  • సాధారణం కంటే రెండుమూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు
  • నిన్న ఒంగోలులో దేశంలో అత్యధికంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Ongole Records Highest Temperature in Monsoon Season

దేశవ్యాప్తంగా నిన్నమొన్నటి వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఇప్పటికీ ఇంకొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వానలు పడుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు మాత్రం వేసవిని తలపిస్తోంది. గత పది రోజులుగా ఇక్కడి ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నైరుతి రుతుపవనాలు బలహీనపడడంతో వరుణుడు ముఖం చాటేశాడు. 

దీంతో అక్కడక్కడా జల్లులు పడుతున్నా మిగిలిన ప్రాంతాల ప్రజలు మాత్రం అధిక ఉష్ణోగ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి వాతావరణం కూడా వేడిగా ఉంటోంది. సాధారణం కంటే రెండుమూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. గత పది రోజులుగా కోస్తా, రాయలసీమల్లో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

ఇక, నిన్న దేశంలోనే అత్యధికంగా ఒంగోలులో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో రేడియేషన్ తీవ్రత ఎక్కువగా ఉందని, ఫలితంగా ఎండలు భరించలేనంతగా ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ పరిస్థితి చోటుచేసుకున్నట్టు వివరించారు.

More Telugu News