New Delhi: ఢిల్లీలో మరో మంకీ పాక్స్ కేసు నమోదు.. నైజీరియా నుంచి వచ్చిన యువతికి పాజిటివ్

  • ఇటీవలే నైజీరియా నుంచి వచ్చిన 22 ఏళ్ల యువతి
  • అనారోగ్యం, చర్మంపై దద్దుర్లతో ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చేరిక
  • శాంపిల్స్ సేకరించి పరిశీలించగా మంకీపాక్స్ సోకినట్టు నిర్ధారణ
Delhi reports 5th monkeypox case

దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీ పాక్స్ కేసు నమోదైంది. కొన్నిరోజుల కిందట ఆఫ్రికాలోని నైజీరియా నుంచి వచ్చిన 22 ఏళ్ల యువతికి ఆరోగ్యం బాగోలేకపోవడం, చర్మంపై దద్దుర్లు రావడంతో ఆసుపత్రిలో చేరింది. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించిన వైద్యులు.. ఆమెకు సోకినది మంకీ పాక్స్ వైరస్ అని శనివారం నిర్ధారించారు. సదరు యువతి నైజీరియా దేశానికి చెందినవారేనని.. ఆమె అక్కడి నుంచి వచ్చే ముందే మంకీ పాక్స్ సోకి ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు రోజుల కిందట ఢిల్లీలోని ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చేరిందని, తగిన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.

ఇప్పటివరకు ఐదు కేసులు..
తాజాగా పాజిటివ్ వచ్చిన నైజీరియా యువతితో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మంకీ పాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ఇద్దరు మహిళలుకాగా, ముగ్గురు పురుషులు. ఇందులో ఒక వ్యక్తి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారని.. మిగతా నలుగురు ఎల్ఎన్ జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

More Telugu News