Taneti Vanita: మా ఎంపీని మేం కాపాడుతున్నట్టు, ఆ మహిళకేదో అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు: ఏపీ హోంమంత్రి వనిత

  • గోరంట్ల మాధవ్ అంశంలో వైసీపీ, టీడీపీ మధ్య వార్
  • తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న టీడీపీ నేతలు
  • టీడీపీ హయాంలో జరిగిన ఘటనలను ప్రస్తావించిన హోంమంత్రి  
AP Home Minister Taneti Vanita press meet

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం పట్ల ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తమ ఎంపీని తాము కాపాడుతున్నట్టు, ఆయన వల్ల బాధింపబడిన మహిళకేదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళా నేతలు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో గమనించుకోవాలని హితవు పలికారు. ఆ మహిళానేతలు వాడే పదజాలం రాష్ట్రంలోని మహిళలందరూ సిగ్గుపడేలా ఉందని తానేటి వనిత విమర్శించారు. ఇవాళ ఈ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సీఎం జగన్ మూడేళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉండడం ఓర్వలేక ఇలాంటి బురద చల్లే కార్యక్రమాలకు దిగుతున్నారని ఆరోపించారు. విమర్శించడానికి ఏ కారణాలు దొరక్క ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని అన్నారు.  

మాధవ్ అంశంలో వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, అది నిజమని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. మహిళలకు న్యాయం చేయడానికే తమ ప్రభుత్వం ఉందని ఆమె ఉద్ఘాటించారు. 

"ఈ అంశంలో మాట్లాడుతున్న టీడీపీ మహిళానేతలను నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఓ మహిళా అధికారిని జుట్టు పట్టుకుని ఈడ్చి కొడితే ఆమె ఫిర్యాదు చేసింది. ఆమెకు మీ ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదు? నాడు మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి రావెల కిశోర్ బాబుపై ఓ ముస్లిం మహిళ వేధింపుల ఆరోపణలు చేస్తే ఏ చర్యలు తీసుకున్నారు? మంత్రి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆమె ఏడుస్తూ మీడియా ముందుకు వచ్చింది. ఆమెకు ఏం న్యాయం జరిగింది?

ఒకటికి రెండుసార్లు మాట్లాడితే నిజాలు అయిపోతాయా? మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడినా నిజాలు అయిపోతాయన్న భ్రమలో ఉన్నారు. నాడు విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై బుద్ధా వెంకన్న ఏంచెబుతారు? మహిళలకు అప్పులు ఇచ్చి అప్పు తీర్చలేని స్థితిలో ఉన్న మహిళలను వ్యభిచారంలోకి దింపారు. నాడు మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? " అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గోరంట్ల మాధవ్ అంశంలో విచారణ అనంతరం వచ్చే నివేదికను బట్టే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

More Telugu News