Lalit Kumar Modi: సుస్మితా సేన్‌తో ల‌లిత్ మోదీ పెళ్లి.. ఆపై మాట మార్చి మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చిన ఐపీఎల్ మాజీ బాస్‌

  • సుస్మితా సేన్‌తో పెళ్లి అంటూ ల‌లిత్ మోదీ ట్వీట్‌
  • ఆ వెంట‌నే కేవ‌లం డేటింగేన‌ని వెల్ల‌డి
  • ఏదో ఒక రోజు సుస్మిత‌తో పెళ్లి ఖాయ‌మన్న ఐపీఎల్ వ్య‌వ‌స్థాప‌కుడు
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన సుస్మిత‌, మోదీ ఫొటోలు
ipl ex chairman tweet on his marriage with sushmita sen

మాజీ విశ్వ సుంద‌రి, బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి సుస్మితా సేన్‌తో త‌న పెళ్లి అంటూ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) వ్య‌వ‌స్థాప‌కుడు, ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ గురువారం రాత్రి ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఆ వెంట‌నే పెళ్లి కాదు... కేవ‌లం డేటింగ్ మాత్ర‌మేన‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా ఏదో ఒక రోజు పెళ్లి కూడా జ‌రిగి తీరుతుందంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు గురువారం రాత్రి ట్విట్ట‌ర్ వేదిక‌గా నిమిషాల వ్య‌వ‌ధిలోనే వ‌రుస ట్వీట్లు చేసిన ల‌లిత్ మోదీ... ఇటు బాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు అటు క్రీడా ప్ర‌ముఖుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

గురువారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో ల‌లిత్ మోదీ త‌న తొటి ట్వీట్‌ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌లో మాల్దీవులు, సార్డియానా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని ఇప్పుడే లండ‌న్ తిరిగి వ‌చ్చాన‌ని మోదీ తెలిపారు. ఈ టూర్‌కు ప‌లు కుటుంబాల‌తో క‌లిసి వెళ్లాన‌ని చెప్పిన ఆయ‌న ఆ కుటుంబాల పేర్లు చెప్ప‌న‌ని తెలిపారు. సుస్మితా సేన్‌ను త‌న బెట‌ర్ హాఫ్ గా పేర్కొన్న మోదీ.. ఎట్ట‌కేల‌కు త‌న జీవితంలో కొత్త అధ్యాయం మొద‌లైంద‌ని తెలిపారు.  

ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో ఓ వైపు వైర‌ల్ అవుతుండ‌గానే.. 8.30 గంట‌ల ప్రాంతంలో మ‌రో ట్వీట్‌ను ల‌లిత్ మోదీ పోస్ట్ చేశారు. ఇంత‌కుముందు పోస్ట్ చేసిన ట్వీట్‌పై క్లారిటీ ఇస్తున్నాన‌ని చెప్పిన మోదీ... సుస్మితాతో డేటింగ్ మాత్ర‌మే చేస్తున్నాన‌ని తెలిపారు. అయితే ఆమెతో పెళ్లి కూడా ఏదో ఒక రోజున జ‌రిగి తీరుతుంద‌ని మోదీ ప్ర‌క‌టించారు. ఈ ట్వీట్ల‌కు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో సుస్మితా సేన్‌తో తాను స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను ఆయ‌న జ‌త చేశారు.

More Telugu News