Team India: ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్​ గా రోహిత్​ శర్మ అరుదైన రికార్డు

  • టీ20ల్లో 300 ఫోర్లు కొట్టిన భారతీయుడిగా ఘనత
  • ఓవరాల్ గా రెండో స్థానంలో నిలిచిన రోహిత్
  • ఇంగ్లండ్ తో రెండో టీ20లో భారత్ ఘన విజయం
Rohit shama breaks another record

తన బ్యాట్ తో పరుగుల మోత మోగిస్తూ.. కెప్టెన్ గా వరుస విజయాలు సాధిస్తున్న  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు బద్దలు కొట్టాడు. టీ 20 ఫార్మాట్‌లో 300 ఫోర్లు బాదిన భారత తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో శనివారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచులో రోహిత్‌ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడు రోహిత్ శర్మ. 

ఐర్లాండ్‌ స్టార్‌ క్రికెటర్ పాల్‌ స్టిర్లింగ్‌ 325 ఫోర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే, అతను చిన్న జట్లు, అసోసియేట్ దేశాలపైనే ఎక్కువగా ఆడి ఈ రికార్డు సాధించాడు. రోహిత్ మాత్రం భారత్ తరఫున నాణ్యమైన జట్లపై ఆడి 301 ఫోర్లతో రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ  మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో గప్తిల్‌ (165) తొలి స్థానంలో ఉండగా.. రోహిత్‌ 157 సిక్స్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. 

మరోవైపు ఇంగ్లండ్ జట్టుతో రెండో టీ20లో భారత్ 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీసును 2-0 తో కైవసం చేసుకుంది. కెప్టెన్ గా రోహిత్ శర్మకు ఇది వరుసగా 14వ విజయం కావడం విశేషం. దాంతో, టీ20ల్లో వరుసగా ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్ గా తన రికార్డును మరింత మెరుగు పరుచుకున్నాడు. కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ రోజు రాత్రి నాటింగ్హామ్ లో మూడో మ్యాచ్ జరుగుతుంది.

More Telugu News