Manipal Hospital: సీఎం జగన్ పీఏ నంటూ కార్పొరేట్ ఆసుపత్రికి మెసేజ్ పంపి రూ. 10 లక్షల డిమాండ్: గుర్తు తెలియని వ్యక్తిపై కేసు

  • మణిపాల్ ఆసుపత్రి ఎండీకి మెసేజ్
  • తాను సీఎం పీఏ నాగేశ్వరరెడ్డినని పరిచయం
  • ఇంటర్నేషనల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు రికీబుయ్ అనే యువకుడు ఎంపికయ్యాడని పేర్కొన్న వైనం
  • క్రికెట్ కిట్‌ కోసం రూ. 10,40,440  పంపాలని డిమాండ్
Unidentified Man demand Rs 10 lakh from A hospital as pose as CM PA

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పీఏనంటూ ఓ వ్యక్తి కార్పొరేట్ ఆసుపత్రికి మెసేజ్ పంపి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదుతో ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

తాడేపల్లి పోలీసుల కథనం ప్రకారం.. మణిపాల్ ఆసుపత్రి ఎండీకి ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. పంపిన వ్యక్తి తాను సీఎం పీఏ నాగేశ్వరరెడ్డినని పరిచయం చేసుకుంటూ.. రాష్ట్రానికి చెందిన రికీబుయ్ అనే యువకుడు ఇంటర్నేషనల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు ఎంపికయ్యాడని పేర్కొన్నాడు. అందులో ఆడాలంటే అతడికి ఇంటర్నేషల్ క్రికెట్ కిట్ అవసరమని, అందుకు రూ. 10,40,440 అవసరం అవుతుందని, ఆ మొత్తాన్ని పంపాలని కోరాడు. 

బెంగళూరులో ఉన్న ఆసుపత్రి ఎండీ ఆ మెసేజ్‌ను తాడేపల్లి మణిపాల్ వైద్యశాల అసోసియేట్ డైరెక్టర్ జక్కిరెడ్డి రామాంజనేయరెడ్డికి ఫార్వార్డ్ చేసి పరిశీలించాలని కోరారు. అది చూసిన ఆయన అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వ్యక్తిపై ఇప్పటికే ఇలాంటివి ఆరు కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, ఇటీవల నెల్లూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. తాను ఓ మంత్రి పీఏనంటూ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

More Telugu News