Tollywood: ‘నాంది’ దర్శకుడితోనే అల్లరి నరేశ్ 60వ సినిమా.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరింది!

  • ‘నాంది’తో మంచి విజయం ఖాతాలో వేసుకున్న అల్లరి నరేశ్ 
  • విజయ్ కనకమేడలకు మరో అవకాశం ఇచ్చిన యువ నటుడు
  • నేడు అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం
Allari Naresh 60th movie with naandi director vijay  Announced today

‘నాంది’ సినిమాతో మంచి సక్సెస్ తోపాటు తన నటనతో ప్రశంసలు అందుకున్న అల్లరి నరేశ్ తన 60వ చిత్రానికి పచ్చజెండా ఊపాడు. ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడలకే మరో అవకాశం ఇచ్చాడు. 'కృష్ణార్జున యుద్ధం', 'మజిలీ', 'గాలి సంపత్', 'టక్ జగదీష్' చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. నరేశ్- విజయ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రాన్ని సోమవారం అధికారికంగా  ప్రకటించారు.  

నరేశ్ కు ఇది 60వ చిత్రం కావడం విశేషం. ఈ సందర్భంగా చిత్రం బృందం విడుదల చేసిన తొలి పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. సంకెళ్లు ఉన్న రెండు చేతులు.. గోడపై పక్షి నీడలా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ట్విట్టర్ లో షేర్ చేసిన అల్లరి నరేశ్... ‘షాడో ఆఫ్ హోప్ (ఆశ యొక్క నీడ)’ అని హ్యాష్ ట్యాగ్ చేశాడు. విజయ్ కనకమేడల తన రెండో చిత్రం కోసం శక్తిమంతమైన కథ రాసుకున్నారని, ఇది కొత్త తరానికి నచ్చే యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలుస్తోంది. అల్లరి నరేశ్ ని మరో ఇంటెన్స్‌ రోల్‌లో చూపించబోతున్నాడట.  

నరేశ్ ప్రస్త్తుతం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా చేస్తున్నాడు. ఇది ఆదివాసీల ఇతివృత్తంతో సాగే చిత్రం. కొన్ని నెలల క్రితం చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ ఎన్నికల విధులపై ఓ ఆదివాసి గ్రామానికి వెళ్లే స్కూల్ టీచర్‌గా కనిపించనున్నాడు. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' షూటింగ్ పూర్తయిన వెంటనే కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నరేశ్ భావిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రకటించాల్సి ఉంది.

More Telugu News