Blood Donation: రక్త దాతల దినోత్స‌వం నాడు మెగాస్టార్ చిరంజీవి సందేశం ఇదే!

  • నేడు ప్ర‌పంచ ర‌క్త దాతల దినోత్స‌వం
  • దేశ ప్ర‌జ‌ల‌కు చిరంజీవి కీల‌క సందేశం
  • అత్య‌ధిక ర‌క్త దాత‌లు క‌లిగిన దేశంగా ఆవిర్భ‌విద్దామ‌ని పిలుపు
  • ర‌క్త దానం ఇత‌రుల‌ ప్రాణాల‌ను నిల‌బెట్టే సుల‌భ మార్గ‌మ‌ని వెల్ల‌డి
chiranjeeevi inspirational message on World Blood Donors Day

రక్త దానం అన్నింటికంటే గొప్ప‌ద‌ని ఏళ్ల క్రిత‌మే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌మ్మారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న ఏకంగా చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ పేరిట ఓ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వ‌ర‌కు ఆ కార్య‌క్ర‌మాన్ని చిరంజీవి నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇత‌ర‌త్రా ఎన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టినా... ర‌క్త దానాన్ని మాత్రం చిరంజీవి వ‌దిలేయ‌లేదు. ఏటా తాను ర‌క్త‌దానం చేస్తూ త‌న అభిమానుల‌తో పాటు పెద్ద సంఖ్య‌లో యువ‌త‌ను ఆ దిశ‌గా న‌డిపిస్తూ చిరు సాగుతున్నారు. 

ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ప్ర‌పంచ ర‌క్త దాతల దినోత్సవం సంద‌ర్భంగా చిరంజీవి ఓ సందేశాన్ని విడుద‌ల చేశారు. ఇత‌రుల ప్రాణాల‌ను కాపాడే విష‌యాల్లో అత్యంత సులువైన మార్గం ర‌క్త దాన‌మేన‌ని ఆయ‌న ఆ సందేశంలో పేర్కొన్నారు. ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన దేశాల్లో రెండో స్థానంలో మ‌నం నిలిచామ‌ని చెప్పిన చిరు... ఈ ప్ర‌పంచ ర‌క్త దాతల దినోత్స‌వాన ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ర‌క్త దాత‌లున్న దేశంగా ఆవిర్భ‌విద్దామ‌ని పిలుపునిచ్చారు. 

'రక్త దానం చేయండి.. ప్రాణాల‌ను నిల‌బెట్టండి' అంటూ ఆయ‌న త‌న ట్వీట్‌కు ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా జ‌త చేశారు. ఈ సంద‌ర్భంగా వివిధ స‌మ‌యాల్లో తాను ర‌క్త దానం చేసిన ఫొటోల‌ను ఆయ‌న త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.

More Telugu News