Russia: రష్యాకు మరో ఎదురుదెబ్బ... ఉక్రెయిన్ దాడిలో మరో ఆర్మీ జనరల్ హతం

  • రోజులు గడిచిపోతున్నా కొలిక్కి రాని యుద్ధం
  • 20 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకున్న రష్యా
  • ఇప్పటి వరకు 12 మంది రష్యన్ జనరళ్లను చంపేశామన్న ఉక్రెయిన్
Ukraine kills another Russian Army General

నెలలు గడిచిపోతున్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఒక కొలిక్కి రావడం లేదు. రష్యా చేస్తున్న భీకర దాడిలో ఉక్రెయిన్ ధ్వంసమవుతోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ బలగాలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా రష్యా సైన్యాన్ని నిలువరిస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ కు చెందిన 20 శాతం భూమి రష్యా అధీనంలో ఉంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇటీవల ప్రకటించారు.    

యుద్ధాన్ని ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్ ను రష్యా స్వాధీనం చేసుకుంటుందని అందరూ భావించారు. కానీ అమెరికా, బ్రిటన్, నాటో దేశాలు అందించిన ఆయుధ సాయంతో, ఉక్రెయిన్ బలగాలు వీరోచిత పోరాటం చేస్తున్నాయి. రష్యాకు చెందిన పలు ఫైటర్ జెట్లు, సైనిక వాహనాలు, ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. పెద్ద సంఖ్యలో రష్యన్ సైనికులను చంపేసింది. రష్యన్ జనరళ్లు సైతం ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. తాజాగా మరో రష్యన్ ఆర్మీ జనరల్ హతమయ్యారు. 

తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధంలో జనరల్ రోమన్ కుతుజోవ్ ను ఉక్రెయిన్ బలగాలు చంపేశాయి. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ అధీనంలోని మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకు నలుగురు రష్యన్ జనరళ్లు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాము 12 మంది రష్యన్ జనరళ్లను చంపినట్టు ఉక్రెయిన్ ప్రకటించుకుంది.

More Telugu News