Rajasthan Royals: ఉత్కంఠపోరులో గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చిన డేవిడ్ మిల్లర్

  • చివరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్స్‌లు బాది జట్టుకు విజయాన్ని అందించిన మిల్లర్
  • బట్లర్ భారీ ఇన్నింగ్స్ వృథా
  • ఓడినా రాజస్థాన్‌కు ఇంకా తెరిచే ఉన్న ఫైనల్ ద్వారాలు
  • నేడు లక్నో-బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్
David Miller Triple sixers helps GT seal a finals spot

ఈ సీజన్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఏడు వికెట్లతో ఘన విజయం సాధించి దర్జాగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఫలితంగా అరంగేట్రంలోనే ఫైనల్ చేరిన జట్టుగా రికార్డులకెక్కింది. 

రాజస్థాన్ నిర్దేశించిన 189 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టైటాన్స్ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అండగా డేవిడ్ మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

ఖాతా కూడా తెరవకుండానే వృద్ధిమాన్ సాహా (0) అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన మాథ్యూవేడ్.. గిల్‌కు చక్కని సహకారం అందించాడు. ఇద్దరూ కలిసి సమయోచితంగా ఆడుతూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో 21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 35 పరుగులు చేసిన గిల్ రనౌట్ అయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా గెలుపు బాధ్యతను తనపై వేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే 35 పరుగులు చేసిన వేడ్ కూడా అవుట్ కావడంతో మైదానంలో అడుగుపెట్టిన డేవిడ్ మిల్లర్ మరోమారు చెలరేగిపోయాడు. 

విధ్వంసకర ఆటతీరుతో రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు, పాండ్యా అతడికి అండగా నిలవడంతో విజయం నల్లేరుమీద నడకే అయింది. చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 16 పరుగులు అవసరం కావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, క్రీజులో ఉన్న మిల్లర్ ఒత్తిడిని దూరం చేస్తూ ప్రసిద్ధ్ కృష్ణ వేసిన తొలి బంతిని లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టాడు. రెండో బంతిని కూడా వదిలిపెట్టని మిల్లర్ దానిని మిడ్ వికెట్ మీదుగా స్టాండ్స్‌లోకి తరలించాడు. మూడో బంతిని కూడా మిడ్ వికెట్ మీదుగా బౌండరీ ఆవలకు తరలించి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 

మిల్లర్ ఈ మ్యాచ్‌లో తొలి 14 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేయగా, ఆ తర్వాత 24 బంతుల్లో 58 పరుగులు చేయడం గమనార్హం. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. పాండ్యా 27 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. కాగా, ఈ సీజన్‌లో రాజస్థాన్ స్పిన్నర్లు రెండోసారి విఫలమయ్యారు. 8 ఓవర్లు వేసి 72 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. అంతకుముందు వాంఖడేలో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 8 ఓవర్లలో 64 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జోస్ బట్లర్ విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. బట్లర్ 56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 89 పరుగులు చేయగా, కెప్టెన్ సంజు శాంసన్ 47, పడిక్కల్ 28 పరుగులు చేశారు. గుజరాత్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించిన డేవిడ్ మిల్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

మరోపక్క, ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ రాజస్థాన్‌ ఇంకా ఫైనల్స్ రేసులోనే ఉంది. లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నేడు జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌ విజేతతో రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.

More Telugu News