PM Modi: ఈ నెల 26న హైదరాబాదుకు ప్రధాని మోదీ రాక... ట్రాఫిక్ ఆంక్షల వివరాలు ఇవిగో!

  • ఐఎస్ బీ వార్షికోత్సవానికి హాజరుకానున్న ప్రధాని
  • వివిధ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపు
  • వివరాలు వెల్లడించిన సైబరాబాద్ పోలీసులు
PM Narendra Modi will visit Hyderabad on May 26th

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 26న గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) వార్షికోత్సవానికి మోదీ హాజరుకానున్నారు. నగరానికి ప్రధాని వస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకుని హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

గచ్చిబౌలి కూడలి నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలు బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, మసీద్ బండ, హెచ్ సీయూ డిపో మీదుగా వెళ్లాలని స్పష్టం చేశారు. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చే వాహనాలు హెచ్ సీయూ డిపో, మసీద్ బండ, కొండాపూర్ ఏరియా ఆసుపత్రి, బొటానికల్ గార్డెన్ మీదుగా రావాల్సి ఉంటుందని వివరించారు.

విప్రో కూడలి నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి క్రాస్ రోడ్, హెచ్ సీయూ వెనుక గేటు, నల్లగండ్ల మీదుగా వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో విప్రో కూడలి నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ, రోటరీ, ఓఆర్ఆర్, ఎల్ అండ్ టీ టవర్స్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 

కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు రత్నదీప్, మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు సూచించారు. 

ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. 

ఈ నేపథ్యంలో, గచ్చిబౌలి స్టేడియం నుంచి ఐఐటీ కూడలి వరకు, ఐఐటీ కూడలి నుంచి విప్రో కూడలి వరకు ఉన్న కంపెనీలు తమ పనివేళల్లో మార్పులు చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ విభాగం సూచించింది.

More Telugu News