Gyan Vapi Masjid: ఇప్పటికే బాబ్రీ మసీదును కోల్పోయాము.. ఇప్పుడు మరో మసీదును కోల్పోలేము: అసదుద్దీన్ ఒవైసీ

  • కాశీలోని జ్ఞాన్ వాపి మసీదులో వీడియో సర్వే చేయాలని వారణాసి కోర్టు ఆదేశాలు
  • మసీదు వెలుపలి గోడపై హిందూ దేవతామూర్తుల విగ్రహాలు
  • కోర్టు తీర్పు ప్రార్థనా స్థలాల చట్టం 1991ని ఉల్లంఘించడమేనన్న ఒవైసీ
Dont Want To Lose Another Masjid says Asaduddin Owaisi

జ్ఞాన్ వాపి మసీదు సర్వేకు అనుకూలంగా వారణాసి కోర్టు తీర్పునివ్వడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రార్థనా స్థలాల చట్టం 1991ని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. బాబ్రీ మసీదు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఉల్లంఘించినట్టు అవుతుందని పేర్కొన్నారు. అయితే, బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు.  

వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, మసీద్ కమిటీలు సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఒవైసీ అన్నారు. మతపరమైన స్థలాల స్వభావాన్ని మార్చాలనుకుంటున్న వ్యక్తులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కోరారు. 1991 చట్టం ప్రకారం ఎవరైనా మతపరమైన ప్రాంతాల స్వభావాన్ని మార్చాలనుకున్నట్టు రుజువైతే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పారు. 

వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఈ జ్ఞాన్ వాపి మసీదు ఉంటుంది. ఇది ఒక హిందూ దేవాలయం అంటూ 2021లో ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న శృంగార గౌరి, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలను ప్రతిరోజు పూజించుకునేందుకు అనుమతించాలని పిటిషన్ లో కోరారు. ఈ నేపథ్యంలోనే మసీదులో వీడియో సర్వే నిర్వహించాలని కోర్టు తీర్పును వెలువరించింది. మే 17లోగా సర్వేను తమకు అందించాలని ఆదేశించింది.

More Telugu News