Perni Nani: లారీ ప‌ర్మిట్ల కోసం మూడేళ్లుగా క‌ష్ట‌ప‌డ్డా ఫ‌లితం సాధించ‌లేక‌పోయా: పేర్ని నాని

  • తెలంగాణ, ఏపీల మ‌ధ్య లారీల‌కు కౌంట‌ర్ సిగ్నేచ‌ర్ ప‌ర్మిట్ల‌కు ప్రయత్నించామన్న నాని 
  • తెలంగాణ నుంచి క‌నీస స్పంద‌న రాలేదని ఆవేదన 
  • విశ్వరూప్ అయినా ఆ పర్మిట్ల‌ను సాధించాల‌న్న పేర్ని నాని
perni nani comments on counter signature permits to lorries

ఏపీ కేబినెట్‌లో కీల‌క మంత్రిగా మొన్న‌టిదాకా వ్య‌వ‌హ‌రించిన పేర్ని నాని మూడేళ్ల పాటు క‌ష్ట‌ప‌డ్డా ఓ విష‌యంలో తాను ఫ‌లితం సాధించ‌లేక‌పోయాన‌ని వాపోయారు. ఈ దిశ‌గా తాను తీవ్రంగా య‌త్నించినా... తెలంగాణ నుంచి స‌హ‌కారం లేక‌పోయిన కార‌ణంగానే తాను ఆ ప‌నిలో ఫ‌లితం రాబ‌ట్ట‌లేక‌పోయాన‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. 

ఇటీవ‌లే జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా పేర్ని నాని మంత్రి ప‌ద‌విని కోల్పోగా.. ఆయ‌న నిర్వ‌హించిన ర‌వాణా శాఖ‌కు కొత్త మంత్రిగా పినిపే విశ్వ‌రూప్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో పేర్ని నారి, పినిపే విశ్వ‌రూప్‌ల‌ను మంగ‌ళ‌వారం నాడు ఏపీ లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ స‌న్మానించింది.

ఈ కార్య‌క్ర‌మంలో నాని మాట్లాడుతూ... తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య లారీల ర‌వాణాకు కౌంట‌ర్ సిగ్నేచ‌ర్ ప‌ర్మిట్లు ఉంటే బాగుంటుంద‌ని లారీ ఓన‌ర్లు గ‌తంలో త‌న‌కు చెప్పారని తెలిపారు. దానిపై స‌మాలోచ‌న‌లు చేసిన తాను కూడా ఆ ప‌ర్మిట్లు ఇరు రాష్ట్రాల లారీ ఓన‌ర్లకు ఉప‌యోగం ఉంటుంద‌ని భావించాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీంతో ఈ ప‌ర్మిట్ల కోసం తెలంగాణ స‌ర్కారుతో చ‌ర్చించేందుకు తాను తీవ్రంగా య‌త్నించాన‌న్నారు. అయితే తెలంగాణ నుంచి ఎలాంటి స్పంద‌న రాలేద‌న్నారు. క‌నీసం తెలంగాణ ర‌వాణా శాఖ అధికారి కూడా త‌న‌తో చ‌ర్చించేందుకు ఆస‌క్తి చూప‌లేద‌న్నారు.

కౌంట‌ర్ సిగ్నేచ‌ర్ ప‌ర్మిట్ల‌తో ఏపీ లారీ ఓన‌ర్ల కంటే కూడా తెలంగాణ లారీ ఓన‌ర్ల‌కే అధిక ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని నాని తెలిపారు. ఈ విష‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వానికి తెలిపినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేశారు. ఫ‌లితంగా ప‌ర్మిట్ల కోసం తాను మూడేళ్లుగా క‌ష్ట‌ప‌డ్డా ఫ‌లితం సాధించ‌లేక‌పోయాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. కొత్త‌గా రవాణా శాఖ బాధ్య‌త‌లు చేప‌ట్టిన పినిపే విశ్వరూప్ ఈ ప‌ర్మిట్ల‌ను సాధించేందుకు కృషి చేయాల‌ని నాని కోరారు.

More Telugu News