Cricket: ముంబై ఓ వజ్రాన్ని వదిలేసుకుంది..!

  • ఐపీఎల్ 2022లో అదరగొడుతున్న హార్దిక్ పాండ్యా
  • బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీల్లో తన మార్కు ముద్ర
  • విమర్శకుల నోర్లు మూయించేలా పెర్ఫార్మెన్స్
Mumbai Definitely Had Lost A Diamond

హార్దిక్ పాండ్యా.. ఆల్ రౌండర్ అన్న పేరేగానీ ఇటీవలి కాలంలో అతడి నుంచి ఆ సేవలు అందింది చాలా అరుదనే చెప్పాలి. బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ చేయలేదు.. బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ తో తడబాటు.. దానికి తోడు గాయాల బెడద.. వెరసి కేవలం బ్యాటర్ గానే జట్టులో చోటు. దీంతో అతడిపై ఎన్నెన్ని విమర్శలు వచ్చాయో! అసలు ఆల్ రౌండర్ గా ఉంటాడా? వేరే ఆటగాడు అతడి స్థానంలోకి వస్తాడా? అన్న సందేహాలూ వచ్చాయి. 

ఇటు మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అతడిని వదిలేసింది. మరో మాట లేకుండా కొత్తగా వచ్చి చేరిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. హార్దిక్ ను తీసుకుని కెప్టెన్ గా చేసింది. ఆ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. కెప్టెన్ గా, బ్యాటర్ గా, బౌలర్ గా.. మొత్తంగా ఓ ఆల్ రౌండర్ గా తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. తన మీద విమర్శలు చేసిన వారికి తానేంటో చెబుతున్నాడు. 

అవును మరి, ఐపీఎల్ తాజా సీజన్ లో అతడి గణాంకాలే అందుకు ఉదాహరణ. మరో కొత్త టీం లక్నో సూపర్ జెయంట్స్ తో ఆడిన తొలి మ్యాచ్ లో వికెట్లేమీ తీయకపోయినప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం విలువైన 33 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో 31 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 4 ఓవర్లు వేసి కేవలం 22 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. 

పంజాబ్ తో మ్యాచ్ లో ఒక వికెట్ పడగొట్టి, 27 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ లోనూ జట్టు విజయం సాధించింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధసెంచరీ సాధించి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఒక వికెట్ కూడా తీశాడు. ఆ మ్యాచ్ లో ఓడినా కెప్టెన్ గా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక, నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ అతడు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 87 పరుగులు చేసి ఓ దశలో ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. ఒక వికెట్ కూడా తీశాడు. 

మొత్తంగా ఈ సీజన్ లో 228 పరుగులు చేసిన అతడు మూడు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్సీ పరంగానూ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట అని నిరూపించుకుంటున్నాడు. తద్వారా తన జట్టును పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. ఈ క్రమంలోనే అతడిపై క్రికెట్ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

బ్యాటుతోనూ, బంతితోనూ హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నాడని, టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో భారత్ కు ఇది శుభసూచకమని అంటున్నారు. అంతేకాదు, ముంబై ఇండియన్స్ కచ్చితంగా ఓ వజ్రాన్ని వదిలేసుకుని పెద్ద తప్పు చేసిందని కామెంట్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ తోనూ తానో గొప్ప ఆటగాడినని నిరూపించుకుంటున్నాడని అంటున్నారు. అవును మరి, పెద్ద పదవితో పెద్ద బాధ్యతలూ మీద పడతాయంటారు కదా. ఆ రెండింటినీ ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యా సమర్థంగా నిర్వర్తిస్తున్నాడనే చెప్పాలి.

More Telugu News