Russia: ఉక్రెయిన్‌లో గుండెలు పిండేస్తున్న దృశ్యం.. చనిపోయిన యజమాని వద్దనుంచి కదిలేందుకు మొరాయిస్తున్న శునకం!

  • 1930ల నాటి ‘హచికో’ను గుర్తుకు తెస్తున్న శునకం
  • రోడ్డు పక్కన మృతి చెంది పడివున్న యజమాని వద్దే కాపలా
  • ఉక్రెయిన్‌పై దాడిని కొనసాగిస్తున్న రష్యా
Dog refuses to leave side of owners body in Kyiv

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా ఆ దేశాన్ని శవాల దిబ్బగా మారుస్తోంది. వేలాదిమంది ప్రజలు బాంబులు, క్షిపణులకు బలవుతున్నారు. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఉక్రెయిన్ నగరాల ఫొటోలు, వీడియోలు గుండెలను పిండేస్తున్నాయి. 

‘నెక్స్టా’ మీడియా తాజాగా షేర్ చేసిన ఓ ఫొటో అయితే కన్నీళ్లు పెట్టిస్తోంది. రాజధాని కీవ్ ప్రాంతంలో సైకిలుపై వెళ్తున్న ఓ వ్యక్తి రష్యా దాడిలో మరణించి రోడ్డు పక్కన అచేతనంగా పడిపోయాడు. దీనిని గమనించిన అతడి పెంపుడు శునకం యజమాని మృతదేహం పక్కనే కదలకుండా కూర్చుంది. దానిని అక్కడి నుంచి పంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. అక్కడి నుంచి అది కదిలేందుకు మొరాయిస్తోంది. 

హచికో అనే జపాన్ శునకాన్ని ఇది గుర్తుకు తెస్తోంది. మరణించిన తన యజమాని కోసం హచికో అనే శునకం ఏకంగా తొమ్మిదేళ్లపాటు ఎదురుచూసింది. 1930లలో జపాన్‌లో జరిగిన ఈ ఘటన అప్పట్లో అందరి హృదయాలను పిండేసింది. ఇప్పుడీ శునకం హచికోను గుర్తుకు తెస్తోంది. 

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన రష్యా బాంబులు, క్షిపణులతో దాడిని కొనసాగిస్తోంది. వేలాదిమంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 లక్షల మంది ఉక్రెయిన్‌ను విడిచిపెట్టారు. రాజధాని కీవ్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లి ఉక్రెయిన్ తూర్పు భాగాలపై దృష్టిసారిస్తామని రష్యా గతవారం ప్రకటించింది. 

మరోవైపు, బుచా నగరాన్ని రష్యా దళాలు శవాల దిబ్బగా మార్చేశాయి. వీధుల్లో శవాల కుప్పలు కనిపిస్తున్నాయి. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తుండగా, రష్యా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేస్తోంది.

More Telugu News