Virat Kohli: బస్సులో కోహ్లీ వచ్చి సడన్ గా ఆ మాట చెప్పేసరికి నాతో పాటు అందరం షాక్ అయ్యాం: కేఎల్ రాహుల్

  • నువ్వే కెప్టెన్ అని చెప్పి షాకిచ్చాడు
  • వెన్ను బాగాలేదని నాతో చెప్పాడు
  • ఇంత త్వరగా అవకాశం వస్తుందని ఊహించలేదు
  • కొత్తగా, గర్వంగా అనిపించిందన్న రాహుల్
After Kohli Said That Thing Suddenly I Get Shocked Says Rahul

టీమిండియా భవిష్యత్ కెప్టెన్ గా రాహుల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పటికే సౌతాఫ్రికాతో ఓ టెస్టుకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు కూడా. అయితే, ఆ టెస్టు మ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. అతడి వెన్నుకు గాయం కారణంగా ఆ మ్యాచ్ ను అతడు ఆడలేదు. దీంతో రాహుల్ కు కెప్టెన్ గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్ లకూ అతడే కెప్టెన్ అయినా.. ఆ రెండో టెస్టు, వన్డే సిరీస్ లో అతడికి అదృష్టం కలసిరాలేదు. 

అయితే, ఆనాడు జరిగిన సంఘటనను రాహుల్ గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ వచ్చి తానే కెప్టెన్ అనగానే చాలా షాక్ కు గురయ్యానని తెలిపాడు. ‘‘ఇంత త్వరగా కెప్టెన్సీ అవకాశం నాకు వస్తుందని ఎప్పుడూ నేను ఊహించలేదు. జొహెన్నస్ బర్గ్ లో జరిగిన రెండో టెస్టు కోసం.. మ్యాచ్ ప్రారంభమయ్యే రోజు బస్సులో వెళ్తుండగా కోహ్లీ నా దగ్గరకు వచ్చాడు. ‘నా వెన్ను బాగాలేదు. నువ్వే కెప్టెన్’ అని సడన్ గా నాకు చెప్పాడు. ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యాను. నాతో పాటు అందరూ షాక్ కు గురయ్యారు’’ అని రాహుల్ తెలిపాడు. 

ఆ సమయంలో తాను వైస్ కెప్టెన్ గా ఉన్నానని, భవిష్యత్ లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అది మార్గమని, అందుకు సిద్ధమవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. అయితే, అంత త్వరగా తనకు అవకాశం వస్తుందని మాత్రం ఊహించలేదన్నాడు. దాని వల్ల తాను మానసికంగా ఏం మారలేదని, మన ఆటకు మనమే కెప్టెన్ అన్న విషయాన్ని తాను మరువనని అన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు ఆటను మార్చుకుంటామని పేర్కొన్నాడు. అయితే, ఆ కెప్టెన్ అనే కొత్త హోదా వచ్చినప్పుడు మాత్రం కొత్తగా, గర్వంగా అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశాడు. అందరికీ ఆ అవకాశం రాదని, అవకాశం వచ్చిన వాళ్లు అదృష్టవంతులని చెప్పాడు.

More Telugu News