Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత ఆత్మహత్య.. పోలీసుల వేధింపులు భరించలేకేనని కార్యకర్తల ఆందోళన

  • సోషల్ఏ మీడియాలో పెట్టిన పోస్టులపై కేసు
  • ఇంటికొచ్చి భార్యను హెచ్చరించి వెళ్లిన పోలీసులు
  • విషయం తెలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య
  • మంత్రి అప్పలరాజు ఒత్తిడితోనే వేధింపులన్న టీడీపీ నేతలు
  • ఆసుపత్రి వద్దకు చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
  • డీఎస్పీ హామీతో వెంకటరావు మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించిన నేతలు
TDP Social media cell member commit suicide in srikakuam district

  సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో భయపడిన టీడీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని పొత్తంగి గ్రామంలో జరిగిందీ ఘటన. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గతేడాది పంచాయతీ ఎన్నికల సమయంలో టెక్కలి నియోజకవర్గ వైసీపీ నేతపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ టీడీపీ సోషల్ మీడియా సభ్యుడు కోన వెంకటరావు (39)పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

సోమవారం సాయంత్రం వెంకటరావు ఇంటికి చేరుకున్న టెక్కలి, మందస పోలీసులు ఆయన ఇంటిలో లేకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు రావాల్సి ఉంటుందంటూ ఆయన భార్య కృష్ణవేణిని హెచ్చరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న భర్తకు కృష్ణవేణి విషయం చెప్పడంతో మనస్తాపం చెందిన వెంకటరావు రాత్రి ఏడు గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

విషయం తెలిసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు నిన్న ఉదయం ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపులు భరించలేకే వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నారని, మంత్రి అప్పలరాజు ఒత్తిడితోనే పోలీసులు ఈ పనిచేశారని ఆరోపించారు. వెంకటరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆసుపత్రి వద్దే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆసుపత్రికి చేరుకున్న డీఎస్పీ శివరామిరెడ్డి టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వెంకటరావు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. వెంకటరావును ఆత్మహత్యకు పురిగొల్పిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వైసీపీ గూండాలపై తక్షణమే హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News