Russia: ఈ షరతుకు ఉక్రెయిన్ అంగీకరిస్తే ఈ క్షణమే సైనిక చర్య ఆపేస్తాం: రష్యా

  • ఉక్రెయిన్ లో కొనసాగుతున్న రష్యా దాడులు
  • ఉక్రెయిన్ రాజ్యాంగానికి సవరణ చేయాలన్న రష్యా
  • ఏ కూటమిలోనూ చేరకూడదని షరతు
Russia latest proposal to Ukraine

ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న సైనిక చర్య యావత్ ప్రపంచాన్ని ఆగ్రహావేశాలకు గురిచేస్తోంది. అయితే రష్యా శక్తిసామర్థ్యాల దృష్ట్యా అమెరికా తదితర నాటో దేశాలు, ఈయూ దేశాలు నేరుగా సైనిక చర్యకు దిగకుండా, ఆర్థిక ఆంక్షలతో రష్యాను బలహీనపర్చాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే, రష్యా రెట్టించిన పట్టుదలతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోందే తప్ప, ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. 

ఈ దశలో రష్యా అధినాయకత్వం నుంచి ఆసక్తికరమైన ప్రతిపాదన వచ్చింది. తమ షరతులకు ఉక్రెయిన్ అంగీకరిస్తే ఈ క్షణమే సైనిక చర్య నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియా కార్యదర్శి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ఉక్రెయిన్ తన రాజ్యాంగాన్ని సవరించాలని, అది ఉక్రెయిన్ ఏ కూటమిలోనైనా చేరడాన్ని నిరోధించేలా ఉండాలని పెస్కోవ్ స్పష్టం చేశారు. ఈ షరతుకు ఉక్రెయిన్ అంగీకరిస్తే తాము చేపడుతున్న సైనిక చర్యను ఇప్పటికిప్పుడు నిలిపివేస్తామని పేర్కొన్నారు. 

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో రష్యా తాజా ప్రతిపాదన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఉక్రెయిన్ తన స్పందనను చర్చల సందర్భంగా వెల్లడించే అవకాశముంది.   

కాగా, ఉక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాల జాబితాను రష్యా రూపొందించింది. ఈ జాబితాలో అమెరికా, బ్రిటన్, ఈయూ దేశాలు, జపాన్ ఉన్నాయి. ఈ జాబితాకు రష్యా అధ్యక్ష కార్యాలయం ఆమోద ముద్ర వేసింది.

More Telugu News