Gavaskar: వార్న్ ఏమంత గొప్పవాడేం కాదన్న గవాస్కర్... విరుచుకుపడిన నెటిజన్లు!

  • షేన్ వార్న్ హఠాన్మరణం
  • థాయ్ లాండ్ లో గుండెపోటుతో మృతి
  • వార్న్ కంటే భారత స్పిన్నర్లు, మురళీధరనే గొప్ప అన్న గవాస్కర్
Gavaskar comments on Warne angers netizens

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మిక మృతిపై భారత్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓ టీవీ చానల్లో స్పందించాడు. క్రికెట్ కు వార్న్ అందించిన సేవలను ఓవైపు కొనియాడుతూనే, మరోవైపు భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీధరన్ తో పోల్చితే వార్న్ ఏమంత గొప్పవాడేం కాదని సూత్రీకరించాడు. భారత బ్యాట్స్ మెన్ పై వార్న్ రికార్డు అత్యంత పేలవంగా ఉందని గవాస్కర్ ఈ సందర్భంగా ఎత్తిచూపాడు. 

వార్న్ తో పోలిస్తే ముత్తయ్య మురళీధరన్ ఓ మెట్టు పైనే ఉంటాడని పేర్కొన్నాడు. స్పిన్ బౌలింగ్ ను ఆడడంలో దిట్టలైన భారత బ్యాట్స్ మెన్ పై వార్న్ ఏవిధంగానూ ప్రభావం చూపలేకపోయాడని, అతడితో పోల్చితే భారత క్రికెటర్లపై ముత్తయ్య మురళీధరన్ మెరుగ్గా రాణించాడని గవాస్కర్ వివరించాడు. అంతేకాదు, వార్న్ విచ్చలవిడి జీవనశైలిని కూడా ఈ సందర్భంగా విమర్శించాడు. 

"అతడు ఎప్పుడూ తనకు నచ్చింది చేయడానికి ముందుండేవాడు. జీవితాన్ని ఇష్టం వచ్చిన రీతిలో పరిపూర్ణంగా ఆస్వాదించాలనుకునేవాడు. అతడి అలవాట్లు, జీవనశైలి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించాయనుకుంటా. అందుకే అతడి గుండె తట్టుకోలేకపోయింది. చాలా త్వరగా ఈ లోకాన్ని వీడాడు" అని వివరణ ఇచ్చాడు. 

అయితే, గవాస్కర్ వ్యాఖ్యలు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఏ సమయంలో ఏ వ్యాఖ్యలు చేయాలో తెలుసుకోవాలి అంటూ మండిపడ్డారు. వార్న్ క్లాస్ ను, కనీస మానవతా ధోరణిని గవాస్కర్ ఎలా విస్మరించాడంటూ పలువురు ప్రశ్నించారు. గవాస్కర్ ను ఇంటర్వ్యూలు ఇవ్వకుండా నిషేధించాలని కొందరు డిమాండ్ చేశారు. 

ఓ నెటిజన్ విశ్లేషణాత్మకంగా గవాస్కర్ పై విమర్శలు చేశాడు. "వార్న్ ఆస్ట్రేలియా జట్టులో కొనసాగిన సమయంలో గ్లెన్ మెక్ గ్రాత్, జాసన్ గిలెస్పీ, బ్రెట్ లీ, డామియెన్ ఫ్లెమింగ్ వంటి దిగ్గజ బౌలర్లు ఉండేవారు. వారందరూ కలిసి టెస్టుల్లో 1000కి పైగా వికెట్లు తీసుంటారు. అలాంటివాళ్ల మధ్య ఉంటూ కూడా 708 వికెట్లు తీయడం వార్న్ గొప్పదనం. కానీ మీరేమో వార్న్ గొప్ప స్పిన్నర్ కాదంటున్నారు" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరికొందరు నెటిజన్లు గవాస్కర్ కు ఇగో ఉందని వ్యాఖ్యానించారు.

More Telugu News