Amit Shah: దేశంలోని అన్ని మతాల వారు స్కూలు యూనిఫాంలను అంగీకరించాల్సిందే: అమిత్ షా

  • కర్ణాటకలో హిజాబ్ వివాదం
  • దేశవ్యాప్తంగా ప్రకంపనలు
  • స్పందించిన అమిత్ షా
  • విద్యార్థులు యూనిఫాం ధరించి వస్తేనే బాగుంటుందని వెల్లడి
  • కోర్టు తీర్పును గౌరవిస్తానని స్పష్టీకరణ
Amit Shah opines on hijab row

దేశంలో గత కొన్నిరోజులుగా ప్రకంపనలు సృష్టిస్తున్న హిజాబ్ వివాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే యూనిఫాం ధరించి స్కూలుకు రావడానికే తాను మద్దతు పలుకుతానని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని మతాల వారు స్కూలు యూనిఫాంలను అంగీకరించాలని ఉద్ఘాటించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని వెల్లడించారు.

అయితే, హిజాబ్ పై నిషేధం పట్ల కర్ణాటక హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తన అభిప్రాయం మారొచ్చని అన్నారు. కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉన్నా తాను గౌరవిస్తానని చెప్పారు.

కర్ణాటకలో విద్యాసంస్థలకు హిజాబ్ ధరించి రావడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో ముస్లిం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరసనలకు దిగడం తెలిసిందే. అందుకు బదులుగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి ప్రదర్శనలు చేపట్టారు.

దేశంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలో, ఇష్టానుసారం నడుచుకోవాలో తేలాల్సి ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చే తీర్పును ప్రతి ఒక్కరూ ఆమోదించాలని అన్నారు.

More Telugu News