Andhra Pradesh: మగ టైలర్లు కొలతలు తీయడంపై స్పందించిన మహిళా పోలీసులు.. తామేమీ ఇబ్బంది పడలేదంటూ వీడియోలు

  • ఇబ్బంది ఉంటే ఉన్నతాధికారులకు చెప్పేవాళ్లం
  • కొందరు రాజకీయ లబ్ధి కోసం ఫొటోలను షేర్ చేస్తున్నారు
  • వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా ఉన్నాయి
  • మహిళా పోలీసుల అభిప్రాయాలతో వీడియోల విడుదల 
Nellore police release videos with women constable views

యూనిఫామ్ కోసం మహిళా పోలీసుల నుంచి మగ టైలర్లు కొలతలు తీసుకున్న ఘటన వివాదాస్పదం కావడంతో నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన మహిళా పోలీసులు స్పందించారు. ఈ ఘటనలో తామేమీ ఇబ్బంది పడలేదంటూ సోషల్ మీడియా ద్వారా వీడియో, పోస్టుల రూపంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మహిళా పోలీసుల నుంచి మగ టైలర్లు కొలతలు తీస్తున్న ఫొటోలు, వీడియోలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. దీంతో స్పందించిన నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయం మహిళా పోలీసుల అభిప్రాయాలతో కూడిన వీడియోలు, పోస్టులను విడుదల చేసింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా ఉన్నాయని ఆ వీడియోల్లో మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు కావాలనే ఫొటోలను వైరల్ చేసి పోలీసుశాఖ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహించారని ఆరోపించారు.

ఒకవేళ ఈ విషయంలో నిజంగానే తమకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉండేవాళ్లమని పేర్కొన్నారు. కాగా, పురుష దర్జీలతో మహిళా పోలీసులకు కొలతలు తీయించిన ఘటనలో హెడ్ కానిస్టేబుల్‌ను పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే సస్పెండ్ చేశారు.

More Telugu News