rapist: ప్రతి పురుషుడ్ని రేపిస్ట్ గా నిందించడం సరికాదు: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

  • ప్రతి వివాహాన్ని హింసాత్మకమని చెప్పలేం
  • మహిళలు, చిన్నారుల రక్షణకు కట్టుబడి ఉన్నాం
  • రాజ్యసభలో ఒక సభ్యుడి ప్రశ్నకు స్పందన
To condemn every man as rapist not advisable Smriti Irani

మహిళలు, చిన్నారుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. కానీ, ప్రతి పురుషుడ్ని బలాత్కారుడిగా (రేపిస్ట్) నిందించడం సరికాదన్నారు.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన ఒక కేసుపై ఢిల్లీ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో సీపీఐ సభ్యుడు బినోయ్ విశ్వమ్ ఒక ప్రశ్న లేవనెత్తారు. గృహహింస చట్టంలోని సెక్షన్ 3 కింద గృహహింస నిర్వచనానికి.. అత్యాచారానికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ 375ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి స్మృతి ఇరానీ బదులిచ్చారు.

‘‘ఈ దేశంలో ప్రతి వివాహాన్ని హింసాత్మకమని, ప్రతి పురుషుడ్ని బలాత్కారుడిగా పేర్కొనడం ఈ సభలో సూచనీయం కాదు. మహిళలు, చిన్నారుల రక్షణ ఈ దేశంలో అందరికీ ప్రాముఖ్యమే’’ అని చెప్పారు.

More Telugu News