Bollywood: భారీ బడ్జెట్ సీరియల్.. రూ.130 కోట్లతో నిర్మాణం!

  • నాగిన్ తాజా సీజన్ కు భారీగా డబ్బులు
  • వసంత పంచమినాడు సీరియల్ మొదలు
  • హీరోయిన్ గా బిగ్ బాస్ 15 విన్నర్ తేజస్వి ప్రకాశ్
  • భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ధైర్యం చేస్తున్న ఏక్తా కపూర్
Naagin 6 Will Be Produced At a Huge Rs 130 crore Budget

ఒక సినిమాకు రూ.100 కోట్ల బడ్జెట్ అంటేనే ఒకప్పుడు నోరెళ్లబెట్టేసేవాళ్లం. కానీ, ఇప్పుడు చాలా సినిమాలకు ఇప్పుడది కామన్ బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడా ట్రెండ్ సీరియళ్లకూ పాకినట్టు కనిపిస్తోంది. అవును మరి, బాలీవుడ్ సీరియల్ నాగిన్ (తెలుగులో నాగిని) తాజా సిరీస్ ను రూ.130 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఆ కథానిక.. ఇప్పుడు ఆరో సీజన్ కు సిద్ధమవుతోందట. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ అంత బడ్జెట్ కు ఫిక్స్ అయ్యారు.

అందులో భాగంగా నాగిన్ 6లో హీరోయిన్ గా హిందీ బిగ్ బాస్ 15 సీజన్ విన్నర్ తేజస్వి ప్రకాశ్ ను ఏక్తా కపూర్ ఎంపిక చేశారని అంటున్నారు. సీరియల్ లో ఆమె డ్రెస్సింగ్ కు సంబంధించి కొన్ని దుస్తులనూ ఇంటికి పంపించారని, వాటి ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. తాజా సీజన్ లో ఓ పాము అనే కోణంలోనే కాకుండా.. ఓ సూపర్ హీరోలా నాగిన్ క్యారెక్టర్ ను తీర్చి దిద్దినట్టు తెలుస్తోంది.


తన ప్రియమైన వారి హత్యకు నాగిన్ ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో తాజా సిరీస్ ను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ‘‘నాగిన్ లో ఇదే అత్యంత ఖరీదైన సీజన్. రూ.130 కోట్ల బడ్జెట్ ఏక్తా కపూర్ ఈ సీజన్ ను నిర్మిస్తున్నారు. ఒకవేళ ఇది మాత్రం వర్కవుట్ కాకపోతే ఆమె తర్వాతి నుంచి దుకాణం బంద్ చేయాల్సిందే. చేస్తే పెద్దగానే చేయాలి.. లేదంటే లేదు అనే నిర్ణయంతోనే ఏక్తా ముందుకు వెళుతున్నారు. ఈ సీజన్ లో భారీ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అదే నాగిన్ 6లో హైలైట్ గా నిలుస్తుంది. ఈ సారి తేజస్వి ప్రకాశ్, సింబా నాగ్ పాల్ పై భారీ ఒత్తిడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని ఈ వ్యవహారానికి సంబంధించిన అత్యంత సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కాగా, వసంత పంచమి కానుకగా ఈ శనివారం నుంచి కొత్త సీజన్ మొదలవుతుందని చెబుతున్నారు. పాత సీజన్లలో నాగినులుగా నటించిన అనిత హసనందాని, అదా ఖాన్, సురభి చందనలు స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తారని అంటున్నారు.

More Telugu News