Jonathan Swift: ఇలా కూడా ఉద్యోగం సంపాదించవచ్చా...  ఓ నిరుద్యోగి విజయగాథ

  • బ్రిటన్ లో ఘటన
  • ఉద్యోగ ప్రకటన ఇచ్చిన ఇన్ స్టాంట్ ప్రింట్ కంపెనీ
  • కంపెనీ కరపత్రాలపై రెజ్యూమే ముద్రించిన నిరుద్యోగి
  • కంపెనీ ఆఫీసు వద్ద కార్లకు రెజ్యూమే అంటించిన వైనం
  • సీసీటీవీ ఫుటేజిలో చూసిన మార్కెటింగ్ మేనేజర్
UK youth get job with his creative thinking

కార్పొరేట్, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కావాలంటే రెజ్యూమేలు, సీవీలు, అప్లికేషన్ లు... ఇలా ఎన్నో విధాల తతంగం ఉంటుంది. పరీక్షలు, గ్రూప్ డిస్కషన్లు, ఇంటర్వ్యూలు దాటుకుని వెళితే అప్పుడు ఉద్యోగం ఖరారవుతుంది. అయితే బ్రిటన్ కు చెందిన జోనాథన్ స్విఫ్ట్ అనే నిరుద్యోగి తన బుర్రకు పదునుపెట్టి ఓ ఉద్యోగం సంపాదించిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది. యార్క్ షైర్ లోని ఇన్ స్టాంట్ ప్రింట్ అనే సంస్థ ఉద్యోగులు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. దాంతో జోనాథన్ స్విఫ్ట్ కూడా దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాడు.

కొంచెం పేరున్న కంపెనీ కావడంతో భారీగానే దరఖాస్తులు వస్తాయని గ్రహించిన అతగాడు, కొత్త పంథాలో వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. మామూలుగా రెజ్యూమే పంపితే తనను పట్టించుకోకపోవచ్చని భావించి, ఆ కంపెనీ కరపత్రాలను సేకరించి వాటిపై తన రెజ్యూమే వివరాలు పొందుపరిచాడు. ఆ కరపత్రాలను కంపెనీ ప్రధాన కార్యాలయం వద్దకు తీసుకెళ్లి అక్కడ పార్కింగ్ లో ఉన్న కార్లకు అంటించాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ఆ ఫుటేజిని పరిశీలించిన ఇన్ స్టాంట్ ప్రింట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ క్రెయిగ్ వాస్సెల్... జోనాథన్ స్విఫ్ట్ కార్లకు అంటించిన కరపత్రాలను తెప్పించుకుని చదివాడు. అతడి క్రియేటివిటీకి ముగ్ధుడయ్యాడు. వెంటనే ఇంటర్వ్యూకు ఎంపిక చేయడమే కాదు, ఉద్యోగం కూడా ఇచ్చేశాడు.

తమకు ఇలాంటి కొత్తరకం ఆలోచనలు ఉన్నవాళ్లే కావాలని, అందుకే స్విఫ్ట్ ను ఉద్యోగంలోకి తీసుకున్నామని మార్కెటింగ్ మేనేజర్ వాస్సెల్ తెలిపాడు. కాగా, స్విఫ్ట్ తన రెజ్యూమేను కార్లకు అంటిస్తున్న వీడియో ఫుటేజి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో పంచుకున్నది స్విఫ్ట్ కు ఉద్యోగం ఇచ్చిన ఇన్ స్టాంట్ ప్రింట్ కంపెనీయే.

More Telugu News