Siddipet: సిద్ధిపేటలో కాల్పులు జరిపి రూ.43 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కాల్పుల కలకలం
  • రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారిని టార్గెట్ చేసిన దొంగలు
  • కారు అద్దాలు పగులగొట్టి డ్రైవర్ పై కాల్పులు
  • గాయపడిన డ్రైవర్.. ఆసుపత్రికి తరలింపు 
Firing at Siddipet sub registrar office

సిద్ధిపేటలో దోపిడీ దొంగలు తుపాకీ కాల్పులతో బీభత్సం సృష్టించారు. ఓ కారు డ్రైవర్ పై కాల్పులు జరిపి రూ.43 లక్షలు దోచుకెళ్లారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఓ దుండగుడు కారు అద్దాలు పగులగొట్టి డ్రైవర్ పై కాల్పులు జరిపాడు. అనంతరం నగదు ఉన్న బ్యాగును తీసుకుని, అప్పటికే బైక్ పై సిద్ధంగా ఉన్న మరో దుండగుడితో కలిసి పరారయ్యాడు. డ్రైవర్ పరశురామ్ కాలిపై బుల్లెట్ గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు.

కాగా, శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి నరసయ్య అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్లాట్ అమ్మాడు. ఈ లావాదేవీలో భాగంగా నరసయ్యకు శ్రీధర్ రెడ్డి రూ.43 లక్షలు ఇచ్చాడు. ఆ డబ్బు ఉన్న బ్యాగును నరసయ్య తన కారు డ్రైవర్ పరశురామ్ కు ఇచ్చాడు. తొలుత డబ్బు ఉన్న బ్యాగును ఇవ్వాలంటూ దుండగుడు డ్రైవర్ పరశురామ్ ను బెదిరించాడు. అయితే, పరశురామ్ అందుకు నిరాకరించడంతో దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపినట్టు తెలిసింది.

దీనిపై సిద్ధిపేట సీపీ శ్వేత స్పందిస్తూ, 24 గంటల్లో కేసును ఛేదిస్తామని అన్నారు. నిందితులను పట్టుకునేందుకు 15 బృందాలతో గాలింపు జరుపుతున్నామని తెలిపారు. సిద్ధిపేట పట్టణంలోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని చెప్పారు.

More Telugu News