K Kavitha: మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చి అప్పుడు మాట్లాడండి: బండి సంజయ్ కు కవిత కౌంటర్

  • కేసీఆర్ పాలనలో తెలంగాణ నాస్తికంగా మారుతోందన్న సంజయ్
  • రాజన్న ఆలయాన్ని పట్టించుకోవడంలేదని ఆరోపణ
  • కేంద్రం ఒక్క పైసా కూడా విడుదల చేయడంలేదన్న కవిత
Kavitha counters Bandi Sanjay remarks

కేసీఆర్ పాలనలో తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారిపోయిందని, యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న సర్కారు వేములవాడ రాజన్న ఆలయాన్ని విస్మరిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మేడారం జాతర కంటే ముందు రాజన్న ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోందని, అలాంటిది రాజన్న ఆలయంలో సౌకర్యాలపై పట్టించుకోవడంలేదన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.

ముందు మేడారానికి జాతీయ హోదా తెచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించి ఆ తర్వాతే మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెంటనే ఆమోదింపచేయాలని పేర్కొన్నారు.

"బండి సంజయ్ గారూ... 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అడిగినా పట్టించుకోలేదు" అని కవిత ఆరోపించారు.

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ, గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో ఉండడం మనందరికీ గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో నాలుగు పర్యాయాలు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణకు సీఎం కేసీఆర్ రూ.332.71 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు.

More Telugu News