COVID19: ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి.. తేలిగ్గా తీసుకోవద్దు: డబ్ల్యూహెచ్ వో హెచ్చరిక

  • ఒక్క వారంలోనే కోటిన్నర కేసులు
  • ఇప్పటిదాకా వారంలో అత్యధిక కేసులివే
  • ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది
  • దాని వల్ల కొత్త వేరియంట్లు పుట్టే ప్రమాదం
  • ఒమిక్రాన్ కన్నా ప్రమాదకరమైనవి కావొచ్చన్న డబ్ల్యూహెచ్ వో చీఫ్
Omicron Is So Dangerous Warns WHO Chief

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకారి అని, దానిని తేలిగ్గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) హెచ్చరించింది. కొవిడ్ వారాంతపు నివేదిక విడుదల సందర్భంగా డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ ఒమిక్రాన్ పై ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. కరోనా టీకా తీసుకోని వారికి దానితో ముప్పు ఎక్కువని ఆయన హెచ్చరించారు.

ప్రపంచ వ్యాప్తంగా డెల్టా ప్రభావం తగ్గిపోతోందని, డెల్టాను ఒమిక్రాన్ అధిగమించేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కవారంలోనే కోటిన్నర కేసులు నమోదయ్యాయన్నారు. ఇప్పటిదాకా ఒక్కవారంలో వచ్చిన అత్యధిక కేసులు ఇవేనని పేర్కొన్నారు. చాలా దేశాల్లో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అన్నారు. అయితే ఇంతకుముందు వచ్చిన వేవ్ లతో పోలిస్తే తక్కువేనని అన్నారు.

ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉండడం, ఇప్పటికే చాలా మందికి వ్యాక్సిన్లు వేయడం లేదా ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ వంటి కారణాలతో చాలా మందికి రక్షణ లభిస్తోందని ఆయన చెప్పారు. అయితే డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువే అయినా.. అది ప్రమాదకరమైనదేనని ఆయన హెచ్చరించారు.

కేసులు పెరిగిన కొద్దీ ఆసుపత్రుల్లో చేరే ప్రమాదం ఎక్కువవుతుందని, మరణాలూ పెరుగుతాయని అన్నారు. దాని వల్ల ఆరోగ్య సిబ్బంది, టీచర్లు సహా ఎంతో మంది ఉపాధికి దూరంగా ఉండాల్సి వస్తుందని అన్నారు. కేసులు పెరిగితే ఇప్పుడున్న ఆరోగ్య సిబ్బందిపై పనిభారం మరింత పెరుగుతుందని హెచ్చరించారు. దాని వల్ల ప్రతి నలుగురిలో ఓ వైద్యసిబ్బంది మానసిక ఆందోళనలకు లోనవుతున్నట్టు ఇటీవలి ఓ స్టడీ పేర్కొందని గుర్తు చేశారు. కేసులు పెరిగితే మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చే ప్రమాదమూ ఉంటుందని, అది ఒమిక్రాన్ కన్నా ఇంకా ప్రమాదకరంగా పరిణమించే ముప్పుందని తెలిపారు.

గత వారంలో 50 వేల మంది చనిపోయారని, సంఖ్యాపరంగా అది ఎక్కువేనని అన్నారు. వైరస్ తో బతకాలన్నంత మాత్రాన.. అసలు జాగ్రత్తలు లేకుండా ఉండాలని కాదని చెప్పారు. ప్రపంచంలో చాలా మందికి ఇంకా టీకాలు అందలేదని, ఆఫ్రికాలో ఇంకా 85 శాతం మందికి కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా వేయలేదని, అందరికీ వ్యాక్సిన్లు అందేలా చూడాలని సూచించారు. ఆ గ్యాప్ ను పూరించలేకపోతే కరోనాను అంతం చేయలేమన్నారు.

ఈ ఏడాది ప్రథమార్ధం నాటికి 70 శాతం మందికి టీకాలు వేసే లక్ష్యాన్ని అన్ని దేశాలూ చేరుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఇప్పటిదాకా 90 దేశాల్లో 40 శాతమే వ్యాక్సినేషన్ జరిగిందని, అందులోని 36 దేశాల్లో కనీసం 10 శాతం కూడా పూర్తికాలేదని అన్నారు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న వ్యాక్సిన్లను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ఫస్ట్, సెకండ్ డోసులుగా ఇచ్చిన వ్యాక్సిన్ నే బూస్టర్ డోసుగా వేసినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని చెప్పారు.

గర్భిణులకు కరోనా ముప్పు ఎక్కువగా ఉంటోందని, వారికీ వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ చెప్పారు. దానివల్ల తల్లితో పాటు కడుపులోని బిడ్డకు రక్షణ లభిస్తుందన్నారు. తల్లి నుంచి గర్భంలోని పిల్లలకు కరోనా సోకడం అరుదుగా ఉండడం చాలా అదృష్టమని, తల్లి పాలలోనూ వైరస్ మూలాలు లేవని చెప్పారు. అయితే, కొన్ని దేశాల్లో కరోనా సోకిన తల్లి నుంచి అప్పుడే పుట్టిన పిల్లలను వేరుగా ఉంచుతున్నారని, అది అనవసరమని, నవజాత శిశువుల ఆరోగ్యానికి అది హానికరమని హెచ్చరించారు.

More Telugu News