loan recovery agent: రుణ వసూలు ఏజెంట్ల వేధింపులకు ఇలా చెక్ పెట్టొచ్చు..!

  • సకాలంలో చెల్లించలేకపోతే అదనపు గడువు కోరాలి
  • ఏజెంట్లను పంపించి వేధిస్తుంటే ఊరుకోవద్దు
  • వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి
  • లేదంటే సివిల్ కోర్టులో వ్యాజ్యం
  • ఆర్బీఐ ముందు ఫిర్యాదు దాఖలు
What to do if loan recovery agent bothers you

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్ సీలు) రుణం తీసుకునే వరకూ వెంట తిరుగుతాయి. రుణాలు తీసుకున్న తర్వాత నుంచి చెల్లించాలంటూ వెంటపడుతుంటాయి. కొన్నిసందర్భాల్లో సకాలంలో ఈఎంఐ చెల్లించలేకపోవచ్చు. ఉన్నట్టుండి ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావచ్చు.

కారణమైదేనా కానీయండి.. చెల్లించకపోవడం వెనుక సహేతుక కారణం ఉంటే అదనపు గడువు ఇవ్వాలని కోరే హక్కు రుణగ్రహీతలకు ఉంటుంది. అయినా కానీ, రుణం చెల్లించాలంటూ ఏజెంట్ల ముఠా రుణగ్రహీత ఎక్కడ ఉంటే అక్కడకు వచ్చి వేధించడానికి లేదు. ఇది చట్టవిరుద్ధం. ఈ తరహా చర్యలపై ప్రయోగించాల్సిన అస్త్రాలు కూడా ఉన్నాయి.

రుణ వసూలు కోసం వచ్చి వేధిస్తున్న వారిపై పోలీసు కేసు నమోదు చేయవచ్చు. మొదటిగా చేయాల్సింది ఇదే. రుణం తీసుకున్న బ్యాంకు శాఖ, లేదా ఎన్బీఎఫ్ సీ శాఖ వద్ద ఫిర్యాదు దాఖలు చేయాలి. వీరు పరిష్కారం చూపకపోతే.. రుణ వసూలు ఏజెంట్ల ఆగడాలకు పుల్ స్టాప్ పడకపోతే.. అప్పుడు రెండో చర్యగా సివిల్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చు. వేధింపుల నుంచి రక్షణ కోరొచ్చు.

ఇలాంటి కేసుల్లో బాధితులకు అండగా కోర్టులు నిలుస్తుంటాయి. చట్టవిరుద్ధమైన విధానాలను అనుసరించొద్దని కోర్టులు ఆదేశిస్తాయి. రుణ వసూలుకు చట్టవిరుద్దంగా వ్యవహరిస్తునట్టు ఆర్బీఐ వద్ద కంప్లయింట్ దాఖలు చేసుకోవచ్చు. ఆర్బీఐ ఈ తరహా విధానాలపై కఠిన చర్యలు తీసుకుంటుంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సర్క్యులర్ లోని ప్యారా 2.5.4 ఇదే చెబుతోంది. బ్యాంకు రికవరీ ఏజెంట్లు మార్గదర్శకాలను ఉల్లంఘించడం, వేధింపుల విధానాలను అనుసరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని అందులో పేర్కొంది.

దీంతో రుణాల వసూలుకు ఏజెంట్లను పెట్టుకున్న బ్యాంకు లేదా ఎన్బీఎఫ్ సీ పై ఆర్ బీఐ చర్యలు తీసుకుంటుంది. ఆయా ప్రాంతంలో ఏజెంట్లను నియమించుకోకుండా నిషేధం విధించొచ్చు. కాకపోతే ఏజెంట్ల ఆగడాలకు ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. కనుక బాధితులు ఆధారాలపై దృష్టి పెట్టాలి.

నిషేధం విధించినా, మరో ముఠా రూపంలో వేధింపులు ఎదురుకావచ్చు. అప్పుడు సైతం మళ్లీ న్యాయస్థానం, ఆర్బీఐ తలుపులు తట్టాల్సి వస్తుంది. పదే పదే ఈ తరహా చర్యలను ఆర్బీఐ, కోర్టులు మన్నించవు. ఎక్కువ కాలం పాటు నిషేధం, మరిన్ని ప్రాంతాలకు నిషేధాన్ని ఆర్బీఐ విస్తరించొచ్చు. బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు పెనాల్టీలను కూడా విధిస్తుంది.

More Telugu News