COVID19: కరోనా టీకాలకు కేంద్రం భారీ ఆర్డర్.. అందుబాటులోకి రానున్న కోట్లాది డోసులు!

  • కొవ్యాక్స్ లో 20 కోట్ల డోసులకు ఆర్డర్
  • ఇటు సీరమ్, భారత్ బయోటెక్ కూ 20 కోట్ల ఆర్డర్లు
  • వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి
  • రాష్ట్రాల వద్ద 17.9 కోట్ల డోసుల టీకాలు
  • జనవరి తొలి వారంలో జైడస్ నుంచి కోటి డోసులు
  • 30 కోట్ల డోసుల బయోలాజికల్–ఈ టీకాలూ అందే అవకాశం 
Center To Procure Huge Amounts Of Covid Vaccines

కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ మరో కొత్త అంకంలోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో టీకాల సమీకరణపై కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. వ్యాక్సిన్ డోసులకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కూటమి ‘కొవ్యాక్స్’లో తన వాటా టీకాలకు భారత్ ఆర్డర్ పెట్టేసింది.

జనవరి 3 నుంచి పిల్లలకూ కరోనా వ్యాక్సిన్లు వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అదేనెల 10 నుంచి వృద్ధులు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో డోసులిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా 58 కోట్ల డోసుల టీకాలకు కేంద్రం ఆర్డర్ పెట్టినట్టు తెలుస్తోంది. కొవ్యాక్స్ లో తన వాటా టీకాల్లోని 20 కోట్ల డోసులను తీసుకునేందుకు ఆర్డర్ పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

‘‘వివిధ దఫాలుగా కొవ్యాక్స్ నుంచి ఈ డోసులను కేంద్ర ప్రభుత్వం సమీకరిస్తుంది. ఇప్పటికే పేద, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలకు కొవ్యాక్స్ ద్వారా భారత్ వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది’’ అని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఆ మొత్తం టీకాలు సీరమ్ ఇనిస్టిట్యూట్ కు చెందినవేనన్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 17.9 కోట్ల డోసుల టీకాలున్నాయి. అవి కాకుండా సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కంపెనీల నుంచి మరో 20 కోట్ల డోసుల టీకాలకు ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ పెట్టిన ఈ టీకాలన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందే అవకాశాలున్నాయి.

ఇటు జనవరి తొలి వారంలో కోటి డోసుల ‘జైకొవ్ డి’ వ్యాక్సిన్లను ఇచ్చేందుకు జైడస్ క్యాడిలా సంస్థ ముందుకొచ్చింది. 4 లేదా 5వ తేదీ నుంచి టీకాల సరఫరాను మొదలుపెడతామని కంపెనీ ఇప్పటికే చెప్పింది. బీహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లో లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. మరోవైపు ‘బయోలాజికల్ ఈ’ కంపెనీకి చెందిన టీకాలకు అనుమతి వస్తే కోట్లాది డోసులు గంపగుత్తగా వచ్చి పడే అవకాశముంది. టీకా ఫేజ్ 3 స్టడీస్ ఫలితాల డేటాను ఔషధ నియంత్రణ సంస్థకు సంస్థ సమర్పించింది.

వచ్చే వారం దానిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ (ఎస్ఈసీ).. టీకాలకు ఆమోదం తెలిపితే ఒకేసారి 30 కోట్ల బయోలాజికల్ ఈ టీకాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ టీకాల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం చెల్లింపులు కూడా చేసింది. అయితే, స్పుత్నిక్ వి టీకాలకు ఈసారి ఆర్డర్లను పెట్టలేదు.  

ఇక, ప్రికాషనరీ డోసులను తొలివిడతలో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఇవ్వనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లే 2.6 కోట్ల మంది ప్రికాషనరీ డోసుకు అర్హులుగా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 1.03 కోట్ల మంది హెల్త్ కేర్ వర్కర్లు మొదటి డోసు టీకా తీసుకోగా.. 96 లక్షల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లలో 1.83 కోట్ల మంది కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారు. అందులో 1.68 కోట్ల మందికి రెండు డోసులు పూర్తయ్యాయి.

ఇక ప్రికాషనరీ డోసుకు అర్హులైన 60 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధులున్నవారు 6 కోట్ల మంది దాకా ఉన్నారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తంగా ఇప్పటిదాకా 9 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినట్టు లెక్కలు చెబుతున్నాయి. దాంతో పాటు 15–18 ఏళ్ల టీనేజర్లు ఏడున్నర కోట్ల మంది దాకా ఉన్నట్టు అంచనా. టీనేజర్లకు జైడస్, కొవాగ్జిన్ టీకాలను జనవరి 3 నుంచి ఇవ్వనున్నారు.

More Telugu News