WHO: అనేక దేశాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వడంపై డబ్ల్యూహెచ్ఓ అసంతృప్తి

  • రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు
  • చాలామందికి తొలి డోసు కూడా అందలేదన్న అథనోమ్
  • పిల్లలకు కూడా డోసులు ఇస్తున్నారని వెల్లడి
  • ఎవరికి టీకా ఇస్తున్నామన్నది కూడా ముఖ్యమేనని స్పష్టీకరణ
WHO disappoints with booster doses in many countries

రెండేళ్లుగా ప్రపంచ మానవాళిపై పంజా విసురుతున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో రెండు డోసులు ఇచ్చిన తర్వాత బూస్టర్ డోసులు ఇస్తుండడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అసంతృప్తి వ్యక్తం చేసింది.

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ దీనిపై స్పందిస్తూ... పలు దేశాల్లో మామూలు డోసుల కంటే బూస్టర్ డోసుల పంపిణీ ఎక్కువగా జరుగుతోందని వివరించారు. అల్పాదాయ దేశాలు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ డోసుల కోసం చూస్తున్నాయని, అయితే అధిక వ్యాక్సినేషన్ రేటు సాధించిన దేశాలు మరింతగా వ్యాక్సిన్ నిల్వలు పెంచుకుంటుండడం ఆయోదయోగ్యం కాదని అన్నారు.

అత్యధిక దేశాల్లో ఆరోగ్య సిబ్బంది, వ్యాధులతో బాధపడుతున్నవారు, వృద్ధులు ఇప్పటికీ తొలి డోసు కోసం ఎదురుచూస్తున్నారని, వారికి డోసులు ఇవ్వకుండా, ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసులు ఇవ్వడం ఏం న్యాయం అని టెడ్రోస్ అథనోమ్ ప్రశ్నించారు. ఇది చాలదన్నట్టు పిల్లలకు కూడా డోసులు ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

వ్యాక్సినేషన్ రేటు పెంచుకోవడం మాత్రమే ముఖ్యం కాదని, ఎవరికి టీకాలు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా గమనించాలని ఆయన ప్రపంచదేశాలకు హితవు పలికారు.

More Telugu News