Asaduddin Owaisi: హుజూరాబాద్‌లోనే కాదు.. యూపీలోనూ బీజేపీకి ఓటమి తప్పదు: అసదుద్దీన్ ఒవైసీ

  • బీజేపీ విభజన రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
  • యూపీలో యోగిని తిరిగి అధికారంలోకి రానివ్వబోం
  • యూపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తున్నాం
  • తెలంగాణలో శాంతిభద్రతలు భేష్
Asaduddin Owaisi Slams BJP

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో లౌకిక కట్టుబాట్లను, బహుజనవాదాన్ని బీజేపీ చెడగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లోనే కాకుండా వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ అడ్రస్ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. యూపీలో తాము 100 స్థానాల్లో పోటీ చేస్తామన్న అసద్.. యోగిని తిరిగి అధికారంలోకి రానివ్వబోమని, అదే తమ లక్ష్యమని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

త్రిపురలో 15 మసీదులను ధ్వంసం చేశారని, కానీ ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ముస్లింలకు పది ఇళ్లు కూడా కేటాయించలేదని ఆరోపించారు. గతేడాది హైదరాబాద్ భారీ వర్షాలతో అతలాకుతలమైనప్పుడు బీజేపీ ఏ చిన్న సాయం కూడా అందించలేదని, అదే బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రం చిన్నపాటి విపత్తుకే కేంద్రం సాయం అందిస్తోందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదన్నారు. బీజేపీ విభజన రాజకీయాలపై హుజూరాబాద్ ఓటర్లకు చక్కని అవగాహన ఉందన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారని అసద్ ప్రశంసించారు.

More Telugu News